30 శాతం పెరిగిన బియ్యం ధర
అన్ని రకాల బియ్యం ధరలు పెరుగుతున్నాయి. మనదేశంలో అనేక రాష్ట్రాల్లో వరి సాగు తగ్గుతోంది. మరోవైపు బంగ్లాదేశ్, ఇరాన్, ఇరాక్, సౌదీ అరేబియా వంటి దేశాల నుంచి డిమాండ్ పెరుగుతోంది. దీంతో బియ్యం ధరలు ఇటీవల 30 శాతం పెరిగాయి. విదేశాల నుంచి డిమాండ్ పెరగడంతో పాటు దేశీయంగా వరి సాగు విస్తీర్ణం తగ్గనుండటంతో… బియ్యం ధరలకు రెక్కలు వస్తున్నాయి. వరి అధికంగా పండించే రాష్ట్రాల్లో సాగు విస్తీర్ణం 13.3 శాతం తగ్గిందని అధికారులు అంటున్నారు. ఇది జులై 29 నాటి పరిస్థితి. వరి అధికంగా పండింటే యూపీ, బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో వర్షాభావ పరిస్థితుల కారణంగా వరి పంట విస్తీర్ణం బాగా తగ్గింది. దేశీయంగా వరి దిగుబడి పెంచేందుకు బంగ్లాదేశ్ ప్రభుత్వం రైతులకు ఉచితంగా ఎరువులు కూడా అందిస్తోంది. మరోవైపు నాణ్యమైన బియ్యాన్ని భారత్ నుంచి దిగుమతి చేసుకుంటోంది. సోనా మసూరి బియ్యాన్ని బంగ్లాదేశ్ భారీగా దిగుమతి చేసుకుంటున్నట్లు రైస్ ఎక్స్‌పోర్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కృష్ణరావు తెలిపారరు. సాధారణంగా ఖరీఫ్ సీజన్లో మనదేశంలో 3.97 కోట్ల హెక్టార్లలో వరి పండిస్తారు. అందులో పది శాతం పంట విస్తీర్ణం అంటే 37 లక్షల ఎకరాల్లో ఈసారి వరి సాగు చేయడం లేదు. హెక్టారుకు 2.6 టన్నులు వరి దిగుబడి లెక్క వేసినా.. ఈసారి కోటి టన్నులు తగ్గనుంది. అన్ని రకాల బియ్యం ధరలు పెరగడం మార్కెట్‌ను ఆశ్చర్యపరుస్తోంది. రత్న వెరైటీ బియ్యం ధర రూ. 26 నుంచి రూ. 33కు పెరిగింది. గల్ఫ్ దేశాల నుంచి డిమాండ్ బాగుండటంతో బాస్మతి బియ్యం ధర కూడా రూ. 62 నుంచి రూ. 80లకు పెరిగింది.