నిఫ్టిపై బుల్స్ పట్టు
మిడ్ సెషన్‌కు ముందు, క్లోజింగ్ ముందు కాస్త ఒత్తిడి వచ్చినా… వెంటనే నిఫ్టి కోలుకుని ఇవాళ్టి గరిష్ఠ స్థాయిలో క్లోజైంది. ఒకదశలో 17018కి క్షీణించినా… క్లోజింగ్‌లో 17172 అంటే దాదాపు 150 పాయింట్లు పెరిగి 17158 వద్ద ముగిసింది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 228 పాయింట్లు లాభపడగా, సెన్సెక్స్ 712 పాయింట్ల లాభంతో ముగిసింది. చివరి గంటలో సన్ ఫార్మా ఫలితాలు అద్భుతంగా రావడంతో అనేక ఫార్మా కౌంటర్లు దిగువ స్థాయి నుంచి కోలుకున్నాయి. చిత్రంగా బ్యాంక్ నిఫ్టి ఇవాళ్టి ర్యాలీలో బ్యాంక్ నిఫ్టి పాల్గొనలేదు. కాని నిఫ్టి ఫైనాన్షియల్స్ సూచీ ఒక శాతంపైగా పెరిగింది. అన్నికంటే అధికంగా నిఫ్టి మిడ్ క్యాప్ సూచీ 1.54 శాతం లాభంతో ముగిసింది. ఫలితాలు అద్భుతంగా ఉండటంతో ఎస్బీఐ లైఫ్ నిఫ్టిలో టాప్‌గెయినర్‌గా నిలిచింది. డాలర్ బలహీనపడటంతో మెటల్స్ లాభాల్లో ఉన్నాయి. టాటా స్టీల్ ఏడున్నర శాతం, హిందాల్కో ఆరు శాతం పెరగడం విశేషం. ఇక సన్ ఫార్మా లాభాలు అయిదు శాతం దాటాయి. ఇక నష్టపోయిన షేర్లలో డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ ఉంది. ఈ షేర్ నాలుగు శాతం నష్టపోయింది. మిగిలిన నిఫ్టి షేర్లలో నష్టాలు ఒక శాతం లోపే ఉన్నాయి. జొమాటొ ఒత్తిడికి లోనైనా లాభాల్లో ముగిసింది. గత కొన్ని రోజులుగా రాణిస్తున్న పేటీఎం నష్టాలతో ముగిసింది. క్రూడ్ ధరలు పెరగడంతో రిలయన్స్‌కు ఇవాళ గట్టి మద్దతు లభించింది.