For Money

Business News

నికర లాభం 16% డౌన్‌

టెక్‌ కంపెనీల మార్జిన్లపై ఒత్తిడి కొనసాగుతోంది. టర్నోవర్‌లు పెరిగినా అనేక కంపెనీల నికర లాభం తగ్గుతోంది. తాజాగా టెక్‌ మహీంద్రా ఫలితాలు కూడా ఇదే ధోరణిలో ఉన్నాయి. జూన్‌ త్రైమాసికానికి టెక్‌ మహీంద్రా నికర లాభం గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 16% తగ్గి రూ.1,132 కోట్లకు చేరింది.గత ఏడాది ఇదే కాలంలో నికర లాభం రూ.1,353 కోట్లుగా ఉంది. త్రైమాసిక సమీక్షాకాలంలో ఆదాయం రూ.10,198 కోట్ల నుంచి రూ.12,708 కోట్లకు పెరిగిందని కంపెనీ తెలిపింది. భవిష్యత్‌ అవసరాల కోసం గణనీయంగా పెట్టుబడులు పెట్టడంతో పాటు అధిక హైరింగ్‌, సబ్‌ కాంట్రాక్ట్‌ సంబంధిత అంశాలు సంస్థ మార్జిన్లు తగ్గినట్లు కంపెనీ తెలిపింది. ఈ మూడు నెలల్లో కంపెనీ కొత్తగా 6,862 మందిని ఉద్యోగంలో చేర్చుకుంది. దీంతో మొత్తం సిబ్బంది 1.58 లక్షలకు చేరుకున్నారు. బ్యాంకింగ్‌, బీమా విభాగాల్లో మినహా.. మిగిలిన అన్ని విభాగాల్లోనూ టర్నోవర్‌ పెరిగినట్లు కంపెనీ తెలిపింది. కొత్త ఆర్డర్ల విలువ 80.2 కోట్ల డాలర్లని పేర్కొంది. ఉద్యోగుల వలసల రేటు స్వల్పంగా తగ్గి 22 శాతానికి చేరింది.