ఫలితాలు సూపర్
ప్రైవేట్ బ్యాంకింగ్ రంగంలో ఐసీఐసీఐ బ్యాంక్ అనూహ్యంగా దూసుకుపోతోంది. ఈ రంగంలో మొన్నటి దాకా హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తిరుగులేని ఆధిపత్యం చెలాయించింది. గత రెండేళ్ళ నుంచి హెచ్డీఎఫ్సీ బ్యాంక్ పరిస్థితి దారుణంగా మారింది. ఫలితాలు బాగున్నా షేర్ పెరగడం లేదు. అదే సమయంలో ఐసీఐసీఐ బ్యాంక్ జెట్ స్పీడుతో దూసుకుపోతోంది. ఇన్వెస్టర్లు, బ్రోకింగ్ సంస్థలు కూడా ఐసీఐసీఐ బ్యాంక్ షేర్‌ను ఇష్టపడుతుండటం విశేషం. తాజాగా జూన్‌తో ముగిసిన మూడు నెలల్లో బ్యాంక్ రికార్డు లాభాలు సాధించింది. గత ఏడాది ఇదే కాలంలో పోలిస్తే బ్యాంక్ నికర లాభం 50 శాతం పెరిగి రూ. 4,616 కోట్ల నుంచి రూ. 6905 కోట్లకు చేరింది. మార్కెట్ అంచనాలకు మించిన ఫలితాలను బ్యాంక్ ప్రకటించింది. బ్యాంక్ నికర వడ్డీ ఆదాయం (NII) కూడా 21 శాతం పెరిగి రూ. 10,936 కోట్ల నుంచి రూ. 13,210 కోట్లకు చేరింది. అలాగే నికర వడ్డీ మార్జిన్ 4.92 శాతం ఉండటం విశేషం. వడ్డీ యేతర ఆదాయం కూడా బాగా పెరిగింది. ట్రెజరీ ఇన్‌కమ్‌తో సంబంధం లేకుండా బ్యాంక్ వడ్డీ యేతర ఆదాయం 25 శాతం పెరిగి రూ. 3,706 కోట్ల నుంచి రూ. 4,629 కోట్లకు చేరింది. ఫీజుల రూపంలో కస్టమర్ల నుంచి వసూలు చేసిన ఆదాయం 32 శాతం పెరిగి రూ. 3219 కోట్ల నుంచి రూ. 4243 కోట్లకు చేరింది. ఫీజుల రూపంలో వసూలు చేసి మొత్తం 79 శాతం రీటైల్ ఖాతాదారులు, గ్రామీణ ఖాతాదారులతో పాటు బిజినెస్ బ్యాంకింగ్, ఎస్ఎంఈ కస్టమర్ల నుంచి వసూలు చేయడం గమనార్హం. ప్రావిజన్స్ కూడా బాగా తగ్గాయి.