మైండ్‌ట్రీ లాభం 471 కోట్లు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో మైండ్ ట్రీ కంపెనీ రూ.471.6 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.343.4 కోట్లతో పోలిస్తే నికర లాభం 37 శాతం పెరిగిందని కంపెనీ వెల్లడించింది. ఇదే కాలంలో కంపెనీ ఆదాయం కూడా 36 శాతం పెరిగి రూ.3,121.10 కోట్లకు చేరుకున్నట్లు పేర్కొంది. మార్జిన్లు అత్యధికంగా ఉండటం, ఆర్డర్లు రికార్డు స్థాయిలో ఉండటంతో కంపెనీ మంచి పనితీరు చూపించగలిగిందని మైండ్‌ట్రీ సీఈవో, ఎండీ దేబాషిస్ ఛటర్జీ తెలిపారు. గత త్రైమాసికంలో సంస్థకు 57 కోట్ల డాలర్ల విలువైన ఆర్డర్లు వచ్చినట్లు ఆయన వెల్లడించారు.కంపెనీ చరిత్రలో ఈ స్థాయి ఆర్డర్లు రావడం ఇదే మొదటిసారి అని ఆయన చెప్పారు. అయితే కంపెనీ నుంచి ఈ త్రైమాసికంలో 24.5 శాతం మంది ఉద్యోగులు వెళ్ళిపోయారని, వాటిని భర్తీ చేసినట్లు కంపెనీ తెలిపింది. ఈ కంపెనీ ఎల్ అండ్ టీ ఇన్ఫోటెక్లో విలీనం అవుతున్న విషయం తెలిసిందే.