దిగువ స్థాయిలో మద్దతు
మార్కెట్కు దిగువస్థాయిలో మద్దతు అందుతోంది. ఉదయం ఆకర్షణీయ లాభాలతో ప్రారంభమైన నిఫ్టి… అరగంటలోనే 16063 పాయింట్లకు పడినా.. వెంటనే మద్దతు అందింది. ఇపుడు 16094 వద్ద నిఫ్టి 105 పాయింట్ల లాభంతో ట్రేడవుతోంది. ఇటీవల బాగా దెబ్బతిన్న షేర్లలో గట్టి షార్ట్ కవరింగ్ కన్పిస్తోంది. టైటన్ దాదాపు ఆరు శాతం లాభంతో రూ. 2129 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టి 15980పైన ఉన్నంత వరకు ఢోకా లేదని అనలిస్టులు అంటున్నారు. లాంగ్ పొజిషన్లో ఉన్నవారు 15900 స్టాప్లాస్తో కొనసాగింవచ్చని వీరు అంటున్నారు. నిఫ్టి 16128పైన పటిష్ఠంగా క్లోజైతే… ఈ సిరీస్లో 16700ను తాకే అవకాశముందని ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుదర్శన్ సుఖాని అంటున్నారు. అయితే కచ్చితం స్టాప్లాస్తో ట్రేడ్ చేయాలని అన్నారు. నిఫ్టి పెరుగుతున్న కొద్దీ స్టాప్లాస్ను పెంచుకుంటే పోవడం వల్ల అధిక లాభంతో బయటపడవచ్చని ఆయన సూచించారు. నిన్న భారీగా లాభాలు గడించిన బజాజ్ ట్విన్స్లలో ఇవాళ స్వల్ప ఒత్తిడి కన్పిస్తోంది. అయితే దీర్ఘకాలంలో ఈ రెండు షేర్లను అనలిస్టులు సిఫారసు చేస్తున్నారు. బజాజ్ ఫైనాన్స్ రూ.6000 టార్గెట్గా సలహా ఇస్తున్నారు. నిఫ్టి బ్యాంక్ షేర్లలో బ్యాంక్ ఆఫ్ బరోడా ఆకర్షణీయంగా ట్రేడవుతోంది.అలాగే గత కొన్ని రోజులుగా నైకా షేర్లు వెలుగులో ఉంది. ఇక నిఫ్టి మిడ్ క్యాప్ షేర్లలో లారస్ ల్యాబ్ ఇవాళ నాలుగున్నర శాతం లాభంతో తళక్కుమంది.