అరబిందో ఫార్మాకు సెబి వార్నింగ్
హైదరాబాద్‌కు చెందిన అరబిందో ఫార్మా తరచూ వివాదాల్లో ఉంటోంది. తాజాగా స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI) ఆగ్రహానికి గురైంది. గత ఏడాది ఈ కంపెనీకి చెందిన హైదరాబాద్‌లోని యూనిట్‌ను పరిశీలించిన అమెరికా ఫుడ్, డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ( USFDA) తీవ్ర లోపాలు ఉన్నట్లు పేర్కొంది. వీటిని చక్కదిద్దాలని కంపెనీని హెచ్చరించింది. తమ యూనిట్‌ను అమెరికా ఎఫ్‌డీఏ ఆడిట్ చేసి కొన్ని అభ్యంతరాలు వ్యక్తి చేసిందని, వాటిని పరిష్కరించేందుకు తాము కృషి చేస్తున్నామని అరబిందో ఫార్మా స్టాక్ ఎక్స్ఛేంజీలకు తెలిపింది. ఆ తనిఖీల్లో ఎఫ్‌డీఏ అధికారులు ఏయే లోపాలను గుర్తించారన్నదన్నది చెప్పలేదు. దీన్ని సెబీ సీరియస్‌గా తీసుకుంది. హెచ్చరిక లేఖను జారీ చేసింది.
మళ్ళీ అదే తప్పు
గత ఏడాది మే 2 నుంచి 10 వరకూ ఎఫ్‌డీఏ అధికారులు తనిఖీలను నిర్వహించిన తరవాత ఆరు అభ్యంతరాలతో కూడిన ’ఫారమ్ 483’ను జారీ చేసింది. విటమిన్ బి12 లేమితో వచ్చే వ్యాధుల చికిత్సకు ఉపయోగించే సైనోకోబాలమిన్ ఇంజెక్షన్లను అమెరికా మార్కెట్ నుంచి అరబిందో ఫార్మా సబ్సిడరీ రీకాల్ చేసినట్టు ఎఫ్‌డీఏ ప్రకటించినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ వివరాలేమీ అరబిందో ఫార్మా అధికారికంగా స్టాక్ ఎక్స్ఛేంజీలకు తెలియచేయలేదు.
తాము కాన్ఫరెన్స్ కాల్‌లో ఈ విషయాలు చెప్పినట్లు అరబిందో కంపెనీ మరోసారి సెబీని బుకాయించే పని చేసింది. అయితే ఎఫ్‌డీఏ జారీ చేసిన నోటీసు నెట్‌లో ఉందని సెబి పేర్కొంది. కంపెనీ తొలుత చెప్పిన అంశాలకు, కాన్ఫరెన్స్ కాల్‌లో చెప్పిన అంశాలకు ఎలాంటి తేడా లేదని సెబీ గుర్తించింది. దీంతో కంపెనీకి సెబి ఈసారి ఘాటు వార్నింగ్ లేఖను జారీ చేసింది. ఎఫ్‌డీఏ అభ్యంతరాలు వ్యక్తం చేసిన అంశాలన్నిటిని ఎక్స్ఛేంజీకి తెలపాలని ఆదేశించింది.