దేశంలో అతి పెద్ద బ్యాంక్ మోసం
ఇప్పటి వరకు బ్యాంక్ మోసాల్లో ఏబీజీ షిప్‌యార్డ్ కంపెనీ నంబర్ వన్ స్థానంలో ఉండేది. ఈ కంపెనీ బ్యాంకులకు టోపీ పెట్టిన మొత్తం రూ. 23,000 కోట్లు. ఇపుడు రూ. 34,614 కోట్ల ఎగవేతతో దీవాన్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ (డీహెచ్ఎఫ్ఎల్) నంబర్ వన్ స్థానంలో నిలిచింది. మొత్తం రూ. 42,871 కోట్ల రుణ అనుమతి పొందిన కంపెనీ రూ. 34,614 కోట్లు తీసుకుని ఎగ్గొట్టింది. డీహెచ్ఎఫ్ఎల్ కుంభకోణానికి సంబంధించి ఆ కంపెనీ డైరెక్టర్లు కపిల్, ధీరజ్ వాధవాన్‌లపై సీబీఐ ఇపుడు కేసులు నమోదు చేసింది. ఎస్బీఐతో సహా 17 బ్యాంకులకు ఈ కంపెనీ మోసం చేసింది. బ్యాంకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి సీబీఐ అధికారులు.. దర్యాప్తు సమయంలో 12 స్థావరాల్లో సోదాలు నిర్వహించారు. సుధాకర్ శెట్టికి చెందిన అమరిలీస్ రియల్టర్స్‌తో పాటు మరో ఎనిమిది కంపెనీలపై కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కంపెనీ భారీ ఎత్తున నిధులను తరలిస్తోందని, రౌండ్ ట్రిప్పింగ్ చేస్తోందంటూ మీడియాలో వార్తలు రావడంతో బ్యాంకులు 2019 ఫిబ్రవరి 1న సమావేశమై… ఈ కంపెనీ పరిస్థితిని పరిశీలించారు. ఆ తరవత ఎప్పటికపుడు రుణ వసూలు పరిస్థితి చూసి.. నిరర్థక ఆస్తిగా పరిగణిస్తూ వచ్చాయి. ఈ కంపెనీ ఖాతాలను చూసే బాధ్యతను కేపీఎంజీ సంస్థకు అప్పగించాయి బ్యాంకులు. ఈ ఆడిటింగ్‌లో కంపెనీ మోసాలు బయటపడ్డాయి. భూములు, పెట్టుబడుల రూపంలో ఈ నిధులను దారి మళ్ళించినట్లు ఆడిట్లో వెల్లడైంది.