సౌత్ హీట్ రుచి చూస్తున్న బాలీవుడ్
ఆ రోజు రానే వచ్చింది.
ఇప్పటి వరకు ఒక్కో వారం ఒక సినిమా విడుదలైంది. పుష్ప, ఆర్‌ఆర్‌ఆర్, కేజీఎఫ్ సినిమాలు… పరస్పర పోటీ పడలేదు. అలాగే హిందీ సినిమాలతో ఢీ కొనలేదు. పాన్ ఇండియా మూవీకి సౌత్‌మూవీలు కొత్త అర్థం చెప్పాయి. ఇప్పటి వరకు బాలీవుడ్ అంటే హిందీ బెల్ట్ మాత్రమే. కాని సౌత్ ఇండియా మూవీలు పాన్ ఇండియాకు కొత్త నిర్వచనం ఇస్తూ… సౌత్ కాదు, నార్త్ కాదు.. మొత్తం ఇండియాలో ఆడేదే పాన్ ఇండియా అని నిరూపించాయి. వరుసగా హిందీ సినిమాలు ఫ్లాప్ అవుతున్న సమయంలో భూల్ భులయ్య 2 కాస్త ఊరట ఇచ్చింది. కాని… ఈ వారం బాలీవుడ్ తొలిసారి సౌత్‌తో ఢీ కొంటోంది.
ఒకేరోజు మేజర్, సమ్రాట్ పృథ్విరాజ్, విక్రమ్ విడుదలయ్యాయి. బ్లాక్‌బస్టర్ మూవీకి కేరాఫ్ అడ్రస్ అయిన యశ్‌రాజ్ ఫిలిమ్స్ తీసిన సమ్రాట్ పృథ్విరాజ్ … 4000 స్క్రీన్స్‌పై ఆడుతోంది. పైగా అక్షయ్ కుమార్ వంటి స్టార్ హీరో. ఇక సినిమాల రివ్యూ విషయానికొస్తే… ఈ మూడు సినిమాల్లో అడవి శేష్ మూవీ మేజర్‌కు అసాధారణ స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. చాలా పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి. థియేటర్ నుంచి బయటకు వచ్చిన ప్రతి ప్రేక్షకుడు ఈ సినిమాకు 5కి 5 రేటింగ్ ఇస్తున్నాడు. తెలుగులో కాదు. హిందీలో…. సినిమా నిర్మాణ పరంగానే గాక… డబ్బింగ్ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవడంతో… సినిమా ఎక్కడా సౌత్ అని అనిపించదని సినిమా క్రిటిక్స్ అంటున్నారు. పైగా టిపికల్ బాలీవుడ్ దేశభక్తి చిత్రాలకు భిన్నంగా… పూర్తి ఎమోషనల్ ఎలిమెంట్స్‌తో నింపిన ఈ సినిమాను చూసిన తరవాత ప్రేక్షకుల్లో ‘దేశ భక్తి సినిమా ఇలా ఉండాల’నే టాక్ వస్తోది. ఈ సినిమా చూస్తే రెండే రెండు ఫీలింగ్స్ ఉంటాయని హిందీ సినిమా విశ్లేషకురాలు దీక్ష శర్మ అన్నారు. ఒకటి సినిమా పూర్తవుతూనే… సీట్లో నిలబడి క్లాప్స్ కొట్టడం లేదా బరువెక్కిన హృదయంతో థియేటర్ బయటకు రావడం. హిందీ వెర్షన్ మూవీ చూసిన ప్రేక్షకులు ముఖ్యంగా ఢిల్లీ, చండీఘడ్, ముంబై ప్రేక్షకులు పూర్తి సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. తొలిసారిగా పూర్తి ఎమోషనల్ దేశభక్తి సినిమాను చూసిన ఫీలింగ్ కల్గుతోందని చాలా మంది ప్రేక్షకులు అంటున్నారు. ఇప్పటి వరకు పాకిస్తాన్ కోణంలో సినిమా చూపిస్తూ… పాక్‌ను తరిమి తరిమి కొట్టే సినిమాలే వచ్చాయి. కాని అలా తరిమి తరిమి కొట్టే సైనికుల జీవితాలను హృదయానికి హత్తుకునేలా మేజర్ నిలిచింది. మేజర్ మూవీ నేటితరం దేశభక్తి చిత్రాలకు ఓ బెంచ్‌మార్క్‌గా నిలిచింది. ఇక విక్రమ్ మూవీకి సంబంధించిన రివ్యూలు వస్తున్నాయి. చాలా వరకు పాజిటివ్ రివ్యూలే. ఎక్కడా నెగిటివ్ టాక్ లేదు. సమ్రాట్ పృథ్విరాజ్ సినిమాపై అపుడే రివ్యూలు వచ్చేశాయి. ఈ సినిమాకు ఉన్న పెద్ద మైనస్ పాయింట్ అక్షయ్ కుమారేనని సినీ విశ్లేషకులురాలు దీక్షా శర్మ అంటున్నారు. ఈ సినిమాను రివ్యూ చేస్తూ… ”సినిమాను 40 రోజుల్లో పూర్తి చేశాన”ని అక్షయ్‌కుమార్ చేసిన కామెంట్ ఈ సినిమా అతి పెద్ద మైనస్ పాయింట్ అని దీక్షా శర్మ అంటున్నారు. క్రమంగా పృథ్విరాజ్ సినిమా స్క్రీన్స్ ఖాళీ అవుతాయని.. వాటిలోకి మేజర్ మూవీ షిఫ్ట్ కావడం ఖాయమని అంటున్నారు విశ్లేషకులు. మేజర్, విక్రమ్‌ల హవా హిందీ బెల్ట్‌లో కొనసాగుతుందనే టాక్ అపుడే మొదలైంది. హిందీలో అతి పెద్ద నిర్మాణ సంస్థలు కూడా తొలిసారి సౌత్ సినిమాల ధాటి రుచి చూస్తున్నాయి.