For Money

Business News

మెటల్స్‌ ముందు మార్కెట్‌ విలవిల

పెట్రోల్‌, డీజిల్ ధరలు తగ్గడం వల్ల కొన్ని కంపెనీల షేర్లు పెరిగినా… స్టీల్‌ రంగంపై విధించిన ఆంక్షలతో .. ఆ రంగానికి చెందిన షేర్లలో భారీ అమ్మకాల ఒత్తిడి వచ్చింది. దీనికి తోడు దివీస్‌ ల్యాబ్‌లో వచ్చిన లాభాల స్వీకరణ నిఫ్టిని నష్టాల్లోకి తీసుకెళ్ళింది. సరిగ్గా రెండు గంటలకు ప్రారంభమైన ఒత్తిడి చివరి దాకా కొనసాగింది. యూరప్‌ మార్కెట్లు కూడా గ్రీన్‌లో ప్రారంభం కావడంతో నిఫ్టి మిడ్‌ సెషన్‌లో 16414 పాయింట్ల స్థాయిని తాకింది. కాని అక్కడి నుంచి 16185 పాయింట్లకు క్షీణించి 16214 పాయింట్ల వద్ద ముగిసింది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 51పాయింట్లు, సెన్సెక్స్‌ 38 పాయింట్లు క్షీణించింది. మిడ్‌ సెషన్‌లో గ్రీన్‌లోకి వచ్చిన ఎల్‌ఐసీతో సహా అనేక షేర్లు నష్టాల్లోకి జారుకున్నాయి. ఉదయం లాభాల్లో ఉన్న ఆటో షేర్లకు తోడు ఎల్‌ అండ్ టీ, విప్రో కూడా చేరాయి. అయితే ఇవన్నీ నాలుగైదు శాతం లాభపడగా, మెటల్స్‌ నష్టాలు 15 శాతం దాకా ఉన్నాయి. లాభాల తరవాత దివీస్‌లో వచ్చిన అమ్మకాల ఒత్తిడి మార్కెట్‌ వర్గాలను ఆశ్చపర్చింది. ఇక ఇతర సూచీల్లో నిఫ్టి బ్యాంక్‌ స్థిరంగానే ముగిసింది. నిఫ్టి నెక్ట్స్‌ 0.87 శాతం నష్టంతో ముగిసింది.ఈ సూచీ పడటానికి కారణం మెటల్స్‌. ఎన్‌ఎండీసీ, సెయిల్‌ పది శాతం పైగా నష్టంతో ముగిశాయి. మిడ్‌ క్యాప్‌ మాత్రం 0.46 శాతం లాభంతో ముగిసింది. నిఫ్టిలో సగం షేర్లు లాభంలో, మిగిలిన సగం నష్టాల్లో ముగిశాయి.