అదానీకి మరో షాక్…
అదానీ గ్రూప్ మరో గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. హిండెన్‌బర్గ్ రీసెర్చి నివేదిక తరవాత అదానీ గ్రూప్ షేర్లలో అమ్మకాల హోరు ఇవాళ కూడా కొనసాగింది. కొన్ని షేర్లలో స్వల్ప రికవరీ కన్పిస్తున్నా… మెజారిటీ షేర్లు భారీ నష్టాల్లో ముగిశాయి. లాభాల్లో ముగిసినవాటిలో అదానీ ఎంటర్‌ప్రైజస్, అదానీ పోర్ట్స్ కూడా ఉన్నాయి. అయినా అదానీ ఎంటర్‌ప్రైజస్ షేర్ ధర … ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ (ఎఫ్‌పీఓ) ధర కన్నా తక్కువగా ఉండటంతో… ఇన్వెస్టర్లు ఎఫ్‌పీఓకు దూరంగా ఉంటున్నారు. ఈ కంపెనీ ఎఫ్‌పీఓ కనిష్ఠ ధర రూ. 3112 కాగా, ఇవాళ షేర్ రూ. 2892 వద్ద ముగిసింది. అదానీ ఎంటర్ప్రైజ్ ఎఫ్‌పీఓ రేపటితో ముగియనుంది. ఇవాళ ఈ ఆఫర్లో కేవలం 3 శాతానికి సమానమైన దరఖాస్తులే వచ్చాయి. మొత్తం 4.55 కోట్ల షేర్లను కంపెనీ ఆఫర్ చేస్తుండగా… కేవలం 13.98 లక్షల షేర్లకు మాత్రమే దరఖాస్తులు వచ్చాయి. ఈ ఆఫర్ ద్వారా అదానీ గ్రూప్ రూ. 20,000 కోట్లన సమీకరించదలించింది. ఇక రీటైల్ విభాగంలో కేవలం 9.76 లక్షల షేర్లకు మాత్రమే దరఖాస్తులు వచ్చాయి. ఇక క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ అంటే సంస్థాగత ఇన్వెస్టర్లకు 1.28 కోట్ల షేర్లను ఆఫర్ చేయగా కేవలం 4,576 షేర్లకు దరఖాస్తులు వచ్చాయి. కొద్దిసేపటి క్రితం ఇంటర్నేషనల్ హోల్డింగ్ కంపెనీ (ఐహెచ్సీ) అదానీ ఎఫ్పీఓలో 40 కోట్ల డాలర్ల పెట్టుబడి పెడతానని పేర్కొంది. ఇది ఎఫ్పీఓలో 16 శాతానికి సమానం. అంటే మొత్తం 20 శాతానికి సబ్స్క్రిప్షన్ వచ్చినట్లు. మరి మిగిలిన 80 శాతం షేర్లను రేపు ఎవర్ కొంటారో చూడాలి?