For Money

Business News

హైదరాబాద్‌: రికార్డు స్థాయిలో ఇళ్ళ అమ్మకాలు

కరోనా రెండో ఉధృతి రియల్‌ ఎస్టేట్‌కు కలిసి వస్తోంది. జనం కొత్త, విశాలమైన ఇళ్ళకు మారుతున్నారు. పైగా కరోనా ప్రభావం తక్కువగా ఉన్న హైదరాబాద్‌పై ఉత్తరాదివారు ఎక్కువగా మక్కువ చూపుతున్నారు. దీంతో హైదరాబాద్‌ రియల్టీ రంగం దూసుకుపోయింది. 2020 ప్రథమార్ధం (జనవరి-జూన్‌)తో పోల్చితే ఈ ఏడాది ఇదే కాలంలో హైదరాబాద్‌లో నివాస గృహాల అమ్మకాలు ఏకంగా 150 శాతం వృద్ధి చెందాయి. రియల్‌ ఎస్టేట్‌ రంగంలో ప్రధాన రీసెర్చి సంస్థ నైట్‌ఫ్రాంక్‌ ఈ డేటాను వెల్లడించింది. జనవరి-జూన్‌ 2021 మధ్య భారత్‌లో రియల్‌ ఎస్టేట్‌ పరిస్థితిపై ఈ సంస్థ ఓ నివేదిక విడుదల చేసింది. హైదరాబాద్‌లో నివాస గృహాల విక్రయా లు ఏకంగా 150 శాతం వృద్ధి చెంది 11,974 యూనిట్లుగా నమోదయ్యాయని తెలిపింది. గత ఏడాది ఇదే కాలంలో విక్రయాలు కేవలం 4,782 యూనిట్లు మాత్రమే అమ్ముడుబోయాయని నైట్‌ ఫ్రాంక్‌ పేర్కొంది. దేశంలోని 8 ప్రధాన నగరాల్లో ఇళ్ళ అమ్మకాల సగటు వృద్ధి రేటు కేవలం 67 శాతం మాత్రేమే. ఇదే సమయంలో కొత్త ప్రాజెక్టుల ప్రారంభం కూడా ఏకంగా 4,422 యూనిట్ల నుంచి 16,712 యూనిట్లకు పెరిగాయని తెలిపింది. గత ఏడాది పోల్చితే ఇది 278 శాతం అధికమని పేర్కొంది. మరోవైపు ధరలు కూడా పెద్దగా పెరగకపోవడంతో కొనుగోలుదారులు ఈ మార్కెట్‌పై ఆసక్తి చూపుతున్నారు. హైదరాబాద్‌ మార్కెట్‌లో అమ్ముడుపోకుండా మిగిలిపోయిన నివాస యూనిట్లు 11,918 గా ఉన్నట్లు తెలిపింది. రియాల్టీ హైదరాబాద్‌ తరవాత స్థానాల్లో ఎన్‌సీఆర్‌, చెన్నై, కోల్‌కతా, పుణెలు ఉన్నాయి. బెంగళూరులో వృద్ధి రేటు దేశంలోనే అత్యంత కనిష్ఠ స్థాయి కేవలం 22 శాతం మాత్రమే ఉందని నైట్‌ ఫ్రాంక్‌ పేర్కొంది.