For Money

Business News

జెన్‌ టెక్‌: 4 నెలల్లో రూ. 70 నుంచి రూ. 226!

హైదరాబాద్‌కు చెందిన జెన్‌ టెక్నాలజీస్‌ కంపెనీ షేర్‌ గత జూన్‌ నెల నుంచి క్రమంగా పెరుగుతూ వచ్చింది. సెప్టెంబర్‌ నెల నుంచి జెట్‌ స్పీడుతో దూసుకెళుతోంది. ముఖ్యంగా రక్షణ రంగానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రైవేట్‌ రంగానికి పెద్ద పీట వేయడం, అనేక సంస్కరణలు తేవడంతో జెన్‌ టెక్నాలజీస్‌ షేర్‌ దూకుడు పెంచింది. కంపెనీ ఆర్డర్‌ బుక్‌ కేవలం మూడు నెలల్లో రూ. 200 కోట్ల నుంచి రూ. 400 కోట్లను దాటింది. జూన్‌ ఆరంభంలో కేవలం రూ. 70 వద్ద ఉన్న ఈ షేర్‌ సెప్టెంబర్‌ 14 రూ. 237కు చేరింది. అక్కడి నుంచి కాస్త తగ్గింది. సెప్టెంబర్‌ 20న రూ. 171కి చేరింది. కాని అక్కడి నుంచి కంపెనీ షేర్‌లో మళ్ళీ ర్యాలీ కన్పించింది. ఇపుడు కంపెనీ రూ.213లతో కంపల్సరీ కన్వర్టబుల్‌ డిబెంచర్స్‌, కన్వర్టబుల్‌ ఈక్విటీ వారెంట్స్‌ను జారీ చేసేందుకు నిర్ణయించింది. పది మంది ఇన్వెస్టర్లతో పాటు వీరు కూడా తీసుకోనున్నారు. ఈ కంపెనీలో ప్రమోటర్లకు ఇప్పటికే 60 శాతం వాటా ఉంది. తాజాగా వారెంట్ల జారీ తరవాత వీరి షేర్లు పెరిగినా… వీరి స్వల్పంగా తగ్గనుంది. ప్రమోటర్లలో ఒకరైన అశోక్‌ అట్లూరికి ఇపుడు 26.8 శాతం వాటా ఉండగా, కిషోర్‌ దత్‌ అట్లూరికి 19.82 శాతం వాటా ఉంది. సీసీడీ, వారెంట్ల జారీ తరవాత అశోక్‌ వాటా 25.59 శాతానికి, కిషోర్‌ దత్‌ వాటా 18.9 శాతానికి తగ్గుతుంది.ఆధునాతన యుద్ధ పరికరాల డిజైనింగ్‌, ట్రైనింగ్‌ సొల్యూషన్స్‌తో పాటు సిమ్యులేటర్లను కూడా ఈ కంపెనీ తయారు చేస్తోంది. ప్రమోటర్ల పేరిట రెండు డజన్లకుపైగా పేటెంట్లు ఉన్నాయి. కొత్తగా వాటా తీసుకుంటున్నవారిలో మసాచూసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, యూనివర్సిటీ ఆఫ్‌ నోట్రే డామ్‌ డీయూ ఎల్‌ఏసీ, జీపీ ఎమర్జింగ్‌ మార్కెట్స్‌ స్ట్రాటజీస్‌ ఎల్‌పీతో పాటు ముకుల్‌ మహావీర్‌ అగర్వాల్‌ ఉన్నారు. ఈ వార్తతో షేర్‌ గత శుక్రవారం అప్పర్ సీలింగ్‌లో గరిష్ఠ ధర వద్ద ముగిసింది. ఇక సోమవారం కూడా ర్యాలీకి ఆస్కారం ఉంది.