For Money

Business News

అదరగొట్టిన విప్రో

ఐటీ కంపెనీలలో ఎపుడూ డల్‌గా ఉండే విప్రో కంపెనీ ఈసారి అదరగొట్టే ఫలితాలను ప్రకటించింది. నిజానికి విప్రో వాటాదారులకు ఇవాళ డబుల్ బొనంజా. ఒకవైపు అద్భుత ఫలితాలు. మరోవైపు ఒక షేరుకు మరో షేర్‌ బోనస్‌. సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ రూ.3,209 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.2,646 కోట్లతో పోలిస్తే 21 శాతం వృద్ధి నమోదైంది. ఆదాయం మాత్రం రూ.22,516 కోట్ల నుంచి రూ.22,302 కోట్లకు తగ్గినట్లు విప్రో తెలిపింది. నిజానికి ఈటీ నౌ ఛానల్‌ సర్వేలో పాల్గొన్న అనలిస్టులు కంపెనీ రూ. 22,516 కోట్ల టర్నోవర్‌పై రూ. 3,050 కోట్ల నికర లాభాన్ని అంచనా వేశారు. ఆదాయం దాదాపు అనుకున్న స్థాయిలో ఉన్నా… నికర లాభం అంచనాలను మించింది. వాటాదారుల వద్ద ఉన్న ఒక షేరుకు మరో షేర్‌ను బోనస్‌గా ఇవ్వాలని కంపెనీ డైరెక్టర్ల బోర్డు నిర్ణయించింది. బోర్డు ప్రతిపాదనను వాటాదారులు ఆమోదం తెలిపిన తరవాత రికార్డు తేదీ ప్రకటిస్తారు. ఆ తేదీ నాటికి కంపెనీ ఖాతాల్లో ఉన్న ఇన్వెస్టర్లకు బోనస్‌ షేర్లు జారీ చేస్తారు. ప్రస్తుత త్రైమాసికంలో 356 కోట్ల డాలర్ల విలువైన ఆర్డర్లు వచ్చినట్లు విప్రో తెలిపింది.