నిరాశపర్చిన విప్రో నికర లాభం
సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో విప్రో కంపెనీ పనితీరుపై మార్కెట్ మిశ్రమంగా స్పందిస్తోంది. మార్కెట్ అంచనాలకు భిన్నంగా విప్రో పనితీరు ఉందని కొందరు అనలిస్టులు అంటుండగా, మరికొందరు పాజిటివ్‌గా స్పందిస్తున్నారు. సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ రూ. 22540 కోట్ల కన్సాలిడేటెడ్ టర్నోవర్‌పై రూ. 2660 కోట్ల నికర లాభం ప్రకటించింది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే కంపెనీ ఆదాయం 14.6 శాతం పెరగ్గా, నికర లాభం 3.7 శాతం పెరిగింది. ఆదాయం పరంగా కంపెనీ మార్కెట్ అంచనాలకు దగ్గరగా ఉన్నా… నికర లాభం, మార్జిన్ విషయంలో నిరాశపర్చిందని కొందరు విశ్లేషకులు అంటున్నారు. మార్కెట్ అంచనాల కన్నా కేవలం ఒక శాతం తక్కువగా ఫలితాలు వచ్చాయని.. కాబట్టి కంపెనీ పనితీరుపై మరీ నిరాశపడాల్సిన అవసరం లేదని మరికొందరు అనలిస్టులు అంటున్నారు. అంచనాలు మరీ అధికంగా ఊహించి… ఆ మేరకు ఫలితాలు లేవని చెప్పడం అన్యాయమని వీరు అంటున్నారు. జూన్‌తో ముగిసిన త్రైమాసికంతో పోలిస్తే కంపెనీ పనితీరు స్వల్పంగా పెరిగింది. కంపెనీ మార్జిన్ 15.2 శాతం నుంచి 15.11 శాతానికి తగ్గింది. కంపెనీ నుంచి రాజీనామా చేస్తున్నవారి శాతం 23 శాతం. ఫలితాలపై విశ్లేషకులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయడంతో… మార్కెట్ ఎలా స్పందిస్తుందో చూడాలి.