పేటీఎం టార్గెట్ రూ. 900?
ఏ క్షణంలో పేటీఎం మార్కెట్లో ప్రవేశించిందేమోగాని… నెగిటివ్ వార్తలతో ఇన్వెస్టర్లను ఇబ్బంది పెట్టేస్తోంది. గత ఏడాది ఈ కంపెనీ రూ. 2,150లకు ఇన్వెస్టర్లకు షేర్లను ఆఫర్ చేసింది. ఆ ధరను ఇప్పటి వరకు షేర్ అందుకోలేదు. తొలి రోజు నుంచే నష్టాలు. ఒక బ్రోకింగ్ రీసెర్చి కంపెనీ ఇష్యూ సమయంలో పేటీఎం అసలు విలువ రూ.1,200 మాత్రమేనని పేర్కొంది.వారంలోపే దాదాపు ఆ స్థాయికి పడిన షేర్ తరవాత కోలుకుని రూ.1,900 ప్రాంతానికి వచ్చినట్లే వచ్చి మళ్ళీ పతనం కావడం ప్రారంభమైంది. ఇవాళ మక్వరీ బ్రోకింగ్ సంస్థ తన అంచనాలను మార్చింది. గతంలో ఈ సంస్థ కూడా పేటీఎం టార్గెట్ రూ. 1,200గా పేర్కొంది. ఇవాళ తాజాగా అంచనాలను మార్చి రూ.900గా పేర్కొంది. మర్చంట్ బ్యాంకింగ్ బిజినెస్ అనుకున్నంత స్థాయిలో ఉండదని ఈ రీసెర్చి సంస్థ పేర్కొంది. దీంతో షేర్ ఇవాళ మరో ఆరు శాతం క్షీణించి రూ. 1,157కు చేరింది. లిస్టింగ్ ధరతో పోలిస్తే పేటీఎం ఇప్పటికే 58 శాతం క్షీణించింది. స్టాక్ మార్కెట్ ఉత్సాహంతో పరుగులు తీస్తున్న సమయంలో కూడా పేటీఎం కనీసం నిలదొక్కుకోలేకపోతోంది. మార్కెట్ కరెక్షన్ వస్తే ఈ షేర్ ఎక్కడికి దాకా పడుతుందో అన్న టెన్షన్ ఇన్వెస్టర్లలో కన్పిస్తోంది. ఎందుకంటే ఈ కంపెనీ షేర్ దాదాపు 60 శాతం పడినా ఇవాళ కూడా డెలివరీ వాల్యూమ్ 38 శాతమే ఉంది. అంటే ఎవరూ అట్టిపెట్టుకోవడానికి ఇప్పుడు కూడా కొనడం లేదన్నమాట.