For Money

Business News

మార్చిలోగా ఎల్‌ఐసీ ఐపీఓ ఉంటుందా?

ఎల్‌ఐసీ పబ్లిక్‌ ఆఫర్‌ ఉంటుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించినా… ఎపుడు అన్న అంశంపై మార్కెట్‌లో సస్పెన్స్‌ కొనసాగుతోంది. ఎందుకంటే ఈ ఆఫర్‌ ద్వారా ప్రభుత్వం కనీసం లక్ష కోట్ల రూపాయలు సమీకరిస్తుందని అంచనా వేశారు. అయితే ఈ ఏడాది డిజిన్వెస్ట్‌మెంట్‌ టార్గెట్‌ను రూ. 78,000 కోట్లుగా పేర్కొన్నారు.ఇందులో రూ. 12,000 కోట్లు ఇది వరకే సమీకరించారు. ఇక వచ్చే ఆర్థిక సంవత్సరం (22-23)లో డిజిన్వెస్ట్‌మెంట్‌ టార్గెట్‌ రూ.65,000 కోట్లుగా పేర్కొన్నారు. దీంతో అసలు ఐపీఓ ఉంటుందా అన్న అనుమానం మార్కెట్‌ వర్గాల్లో వ్యక్తమైంది. మధ్యాహ్నం జరిగిన మీడియా సమావేశంలో ఇదే అంశంపై మాట్లాడిన ఆర్థిక మంత్రి పబ్లిక్‌ ఆఫర్‌ ఈ ఏడాది ఉంటుందని పేర్కొన్నారు. అలాగే ఐపీఓకు సంబంధించిన డ్రాఫ్ట్‌ ప్రాస్పెక్టస్‌ మరో రెండు వారాల్లో సెబి వద్ద దాఖలు చేస్తామని DIPAM కార్యదర్శి తుహిన్‌ కాంత పాండే తెలిపారు. ఎల్‌ఐసీ వ్యాల్యూయేషన్‌ గురించి ఇంకా చర్యలు జరుగుతున్నాయని ఆయన అన్నారు. చూస్తుంటే పబ్లిక్‌ ఆఫర్‌కు ఫిబ్రవరి నెలలోనే అనుమతి వస్తుందా అన్న అనుమానం ఉంది. చూస్తుంటే అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యేంత వరకు ఈ పబ్లిక్‌ ఆఫర్‌ ప్రక్రియను ప్రభుత్వం పెండింగ్‌లో ఉంచుతుందని, ఎన్నికల తరవాత పబ్లిక్‌ ఆఫర్‌ ఉంటుందని మరికొందరు అంటున్నారు. మరికొందరు పబ్లిక్‌ ఆఫర్‌ వచ్చే ఏడాది అంటే ఏప్రిల్‌ తరవాత ఉంటుందని.. అందులో కొంత మొత్తం ఏడాదికి, మిగిలిన మొత్తం వచ్చే ఏడాది ఖాతాల్లో చూపే అవకాశముందని కూడా వార్తలు వస్తున్నాయి.