For Money

Business News

వీళ్ళు ఎందుకు అమ్ముతున్నారు?

కరోనా సమయంలో కూడా ఈ స్థాయిలో విదేశీ ఇన్వెస్టర్లు ( విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు-FIIs) భారత స్టాక్‌ మార్కెట్‌లో అమ్మకాలు చేయలేదు. 2020 మార్చిలో అంటే కరోనా మహమ్మారి సమయంలో విదేశీ ఇన్వెస్టర్లు రూ.61,972 కోట్ల విలువైన షేర్లను అమ్మారు. ఇపుడు అక్టోబర్‌ నెలలో అంటే 22వ తేదీ వరకు వీరి అమ్మకాలు రూ. 81,865 కోట్లను దాటాయి. వీరి జోరు చూస్తుంటే అమ్మకాల మొత్తం రూ. 90వేల కోట్లను దాటే అవకాశముంది. ఎన్‌ఎస్‌డీఎల్‌, సీఎస్‌డీఎల్‌ అందించిన డేటా ప్రకారం చూస్తే దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్లు (DIIs) ఇదే సమయంలో రూ. 83,271 కోట్ల విలువైన షేర్లను కొన్నారు. లేకుంటే పరిస్థితి చాలా దారుణంగా ఉండేది.
విదేశీ ఇన్వెస్టర్లు అంటే హెడ్జ్‌ ఫండ్స్‌, పెన్షన్‌ ఫండ్స్‌లు కూడా ఉన్నాయి. వీరు ఏ మార్కెట్‌లో అధిక లాభాలు వస్తాయని అనకుంటాయో.. ఆ దేశాల్లో ఇన్వెస్ట్‌ చేస్తారు. మరి వీరు మన దేశీయ మార్కెట్‌లో ఎందుకు అమ్ముతున్నట్లు? దీనికి ప్రధాన కారణం మన మార్కెట్ల వ్యాల్యూయేషన్‌ చాలా అధికంగా ఉండటమేనని ప్రముఖ బ్రోకరేజింగ్ సంస్థ జీరోద పేర్కొంది. ప్రస్తుత ధరలు నిఫ్టి 50కి పీఈ 23 రెట్లు ఉందని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. మరోలా చెప్పాలంటే కంపెనీలు లాభాలకు 23 రెట్ల అధిక మొత్తం ఇన్వెస్టర్లు చెల్లిస్తున్నారు. ఈ స్థాయి పీఈ రేషియో ఇతర వర్ధమాన మార్కెట్లలో లేదు. పీఈ రేషియా చాలా ఉన్నందున మన మార్కెట్‌ నుంచి విదేశీ ఇన్వెస్టర్లు వైదొలుగుతున్నారనేది మొదటి కారణం. రెండోది.. ఇదే సమయంలో చైనా మార్కెట్‌లో షేర్లు చాలా తక్కువ పీఈతో లభించడం. ఇటీల చైనా అనేక రాయితీలు, ప్రోత్సాహకాలు ప్రకటించింది. దీంతో చాలా మంది విదేశీ ఇన్వెస్టర్లు సెల్‌ ఇండియా, బై చైనా స్లోగన్‌ను అందుకున్నారు. మరోవైపు అమెరికా భారీగా వడ్డీ రేట్లను తగ్గించడం. వడ్డీ రేట్లు భారీగా తగ్గడంతో ఆ దేశంలో బాండ్‌ ఈల్డ్స్‌ బాగా పెరిగాయి. పదేళ్ళ బాండ్స్‌పై పీఈ 3.6 శాతం నుంచి 4.2 శాతానికి పెరిగింది. దీంతో చాలా మంది ఇన్వెస్టర్లు షేర్లకు బదలు బాండ్స్‌లో పెట్టుబడికి ఇష్టపడుతారు. కారణం రిస్క్‌ తక్కువ, రాబడి ఎక్కువ. దీంతో భారత్‌ నుంచి చైనాకే కాకుండా, అమెరికాకు కూడా విదేశీ ఇన్వెస్టర్లు నిధులను తరలిస్తున్నారు. ఇక నాలుగో కీలక అంశం. భారత కంపెనీల చెత్త పనితీరు. దేశీయ ద్రవ్యోల్బణం అధికంగా ఉండటం, వృద్ధి రేటు మందగించడంతో అనేక కంపెనీలు పనితీరు నాసిరకంగా ఉంది. ఆశించిన స్థాయిలో లాభాలు ఆర్జించలేక పోతున్నాయి కంపెనీలు. చివరికి కిరాణా సరుకులు అమ్మే హిందుస్థాన్‌ లీవర్‌ కూడా పెద్దగా రాణించలేపోయింది. సూట్‌ కేసులు అమ్మే వీఐపీ వద్ద రూ. 700 కోట్ల విలువైన స్టాక్‌ పడి ఉంది. భారీ డిస్కౌంట్లు ఇస్తున్నా కొనేవారు లేరు. డీ మార్ట్‌ ఫలితాలు నిరుత్సాహకరంగా ఉన్నాయి. పండుగ సీజన్‌లో తమ టూవీలర్స్‌ అమ్మకాలు ఒక శాతం కూడా పెరిగే పరిస్థితి లేదని బజాజ్‌ ఆటో చెప్పింది. ఈ కారణాలన్నింటి వల్ల అటు విదేశీ ఇన్వెస్టర్లే గాక.. దేశీయ రీటైల్‌ ఇన్వెస్టర్లు కూడా అమ్ముతున్నారు. ఈ ఒక్క నెలలో సూచీలు ఏడు శాతం పడ్డాయి. ముఖ్యంగా మిడ్‌ క్యాప్‌ షేర్లు భారీగా క్షీణించాయి. పతనం పది శాతం నుంచి 30 శాతంపైగా ఉంది. అయితే ఇలా విదేశీ ఇన్వెస్టర్లు భారీ అమ్మడం, మార్కెట్‌ పడటం… ఆ వెంటనే మార్కెట్లు పెరగడం సహజం. చరిత్రలో ఇలా చాలాసార్లు జరిగింది.

Leave a Reply