మరింత పెరిగిన గోధుమ, ఆటా ధరలు
కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి చర్యలు లేకపోవడంతో పండుగ సీజన్లో గోధుమలు, గోధుమ ఉత్పత్తులతో పాటు ఆటా ధరలు పెరుగుతూనే ఉన్నాయి. గోధుమల ఉత్పత్తి బాగా తగ్గడంతో ఎఫ్‌సీఐ వద్ద కూడా నిల్వలు తగ్గుతున్నాయి. కనీసం దిగుమతి సుంకం ఎత్తేస్తే… కనీసం ఆ సెంటిమెంట్‌తో నైనా కాస్త ధరలు తగ్గేవి. కాని ప్రభుత్వం అలాంటి చర్యలు తీసుకునే పరిస్థితిలో లేదు. గోధుమల విషయం తీసుకుంటే మార్కెట్ కేవలం ఒక్క నెలలో ధరలు మూడు శాతం పెరగ్గా, గత ఏడాదితో పోలిస్తే 15 శాతం పెరిగింది. అదే ఆటా విషయం తీసుకుంటే ఒక్క నెలలో అయిదు శాతం పెరగ్గా, గత ఏడాదితో పోలిస్తే 20 శాతం పెరిగింది. గత ఏడాది ఇదే కాలంలో కిలో గోధమల ధర రూ.27 ఉండగా, నెల రోజులక్రితం రూ. 30 ఉంది. ఇపుడు మార్కెట్లో రూ.31 ఉన్నట్లు మార్కెట్ వర్గాలు అంటున్నాయి. ఇక ఆటా విషయానికొస్తే గత ఏడాది ఇదే కాలంలో కిలో ధర రూ.30 ఉండగా.. నెల రోజుల క్రితం రూ. 34 కాగా ఇపుడు కిలో రూ. 36 పలుకుతోంది. నిజానికి పండుగ సీజన్లో కేవలం దసరా మాత్రమే ప్రారంభమైందని… మున్ముందు దీపావళి, క్రిస్మస్, కొత్త ఏడాది.. దృష్ట్యా వీటి ధరలు ఇంకా పెరిగే అవకాశముందని వ్యాపారవర్గాలు అంటున్నాయి.