For Money

Business News

MSCIలో అదానీ షేర్ల వెయిటేజీ తగ్గింపు

కార్పొరేట్‌ మోసాల ఆరోపణలను ఎదుర్కొంటున్న గౌతమ్‌ అదానీ గ్రూప్‌ సంస్థలకు మరో గట్టి దెబ్బ తగిలింది. అదానీ కంపెనీలను అమెరికా ఇండెక్స్‌ ప్రొవైడర్‌ ఎస్‌ అండ్‌ పీ డోజోన్స్‌ సస్టయిన్‌బిలిటీ సూచీల నుంచి బయటకు పంపించిన రెండు రోజులకే పలు అంతర్జాతీయ ఇన్వెస్టర్లు ట్రాక్‌ చేసే మోర్గాన్‌ స్టాన్లీ క్యాపిటల్‌ ఇంటర్నేషనల్‌ (ఎంఎస్‌సీఐ) సంచలన నిర్ణయం తీసుకుంది. అదానీ గ్రూప్‌ కంపెనీలకు సూచీలో ఉన్న వెయిటేజీని తగ్గించింది. అమెరికా హెడ్జ్‌ ఫండ్‌ హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ చేసిన ఆరోపణల నేపథ్యంలో కొంతమంది ఇన్వెస్టర్లు పలు అంశాలపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎంఎస్‌సీఐ గ్లోబల్‌ ఇన్వెస్ట్‌బుల్‌ ఇండెక్స్‌ల్లో అదానీ కంపెనీల ఫ్రీఫ్లోట్‌లో మార్పులు చేయాల్సిన అవసరం ఏర్పడిందని ఎంఎస్‌సీఐ పేర్కొంది. అదానీ ఎంటర్‌ప్రైజస్‌, అదానీ టోటల్‌ గ్యాస్‌, అదానీ ట్రాన్స్‌మిషన్‌, ఏసీసీల వెయిటేజీని తగ్గించినట్లు ఎంఎస్‌సీఐ వెల్లడించింది. కొత్త మార్పులు ఫిబ్రవరి 28వ తేదీ నుంచి అంటే మార్చి 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని పేర్కొంది.
ఎంఎస్‌సీఐ స్క్రూటినీ ఎందుకు?
సెబీ నిబంధనల ప్రకారం లిస్టెడ్‌ కంపెనీల్లో ప్రమోటర్ల వాటా 75 శాతానికి మించకూడదు. మిగిలిన 25 శాతం వాటాను పబ్లిక్‌ షేర్ల ట్రేడింగ్‌ కోసం వదిలివేయాలి. దీనినే ఫ్రీఫ్లోట్‌ వాటాగా వ్యవహరిస్తారు. అయితే అదానీ గ్రూప్‌ కంపెనీల 25 శాతం ఫ్రీఫ్లోట్‌ షేర్లలోకి నిధులు వాస్తవ ఫండ్స్‌ నుంచి రాలేదని, బోగస్‌ సంస్థలు పెట్టుబడి చేశాయంటూ హిండెన్‌బర్గ్‌ రిపోర్ట్‌లో ఆరోపించడంతో ఎంఎస్‌సీఐ స్క్రూటినీ కిందకు అదానీ షేర్లు వచ్చాయని తెలుస్తోంది.