For Money

Business News

జీ టీవీ మాకు అక్కర్లేదు.. రిలయన్స్‌

పేరుకే లిస్టెడ్‌ కంపెనీలు.. అంతా వాళ్ళ ఇష్టారాజ్యం. 2 శాతం వాటా ఉన్న ప్రమోటర్‌ ఇంకా అంతా తనదే అన్న ఫీలింగ్‌తో డీల్‌ చేస్తుంటారు. 18 శాతం వాటా ఉన్నవాడి పరిస్థితి ఘోరంగా ఉంది. విచిత్రమేమిటంటే లిస్టెండ్‌ కంపెనీ అయిన జీ ఎంటర్‌టైన్‌మెంట్‌లో జరుగుతున్న ఈ గందరగోళం అంతా రహస్యంగా జరగడం. ఇన్వెస్టర్లకు ఏమీ తెలియకపోవడం. ప్రత్యర్థలు కత్తులు దూసుకోవడంతో అసలు విషయాలు బయటికి వచ్చాయి. అంతా అయ్యాక.. ఈ డీల్‌ మాకొద్దని రిలయన్స్‌ ప్రకటించడం కొసమెరు. ఇంతకీ ఈ కథ ఏమిటంటే…

ఇటీవల సోనీ పిక్చర్స్‌తో జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం ప్రకారం సీఈఓగా జీ అధినేత పునీత్‌ గోయెంకా కొనసాగుతారు. ఆయన వాటా 2 శాతం నుంచి నాలుగు శాతానికి పెరుగుతుంది. ఇపుడు 18 శాతం వాటా ఉన్న ఇన్వెస్కో వాటా తగ్గుతుంది. ఈలోగా మరో కంపెనీతో ఇన్వెస్కో డీల్‌ కోసం ప్రయత్నించింది. ఆ కంపెనీ ఏదో కాదు. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌. ఇవాళ రిలయన్స్‌ చేసిన ప్రకటన ప్రకారం.. ఇపుడు ఏ షరతులతో సోనీ పిక్చర్స్‌తో డీల్ కుదిరిందో అదే షరతులకు రిలయన్స్‌ కూడా అంగీకరించింది. ప్రమోటర్లకు ఎసాప్స్‌ ఇవ్వడంతో పాటు పునీత్‌ గోయంకా మేనేజింగ్‌ డైరెక్టర్‌గా కొనసాగేందుకు కూడా రిలయన్స్‌ ఓకే చెప్పింది. అయితే రిలయన్స్‌ వస్తే తన పప్పులు ఉడకవని భావించారేమో గోయెంకా ససేమిరా అన్నట్లు ఇన్వెస్కో అంటోంది. ప్రమోటర్ల కృషికి తాము గౌరవించామని, అందుకే ఎసాప్‌ ఇవ్వడంతో పాటు పునీత్‌ ఎండీగా కొనసాగేందుకు అంగీకరించామని రిలయన్స్‌ అంటోంది. తాము ఏ కంపెనీ టేకోవర్‌ చేసినా ప్రమోటర్లను గౌరవిస్తామని పేర్కొంది. ప్రమోటర్లను కాదని తాము కంపెనీని టేకోవర్‌ చేయమని, అది మా సంప్రదాయం కాదని రిలయన్స్‌ పేర్కొంది. ఈ డీల్‌లో తాము ఇంక ముందుకు సాగమని స్పష్టం చేసింది.
రెండు శాతం వాటా ఉన్న ప్రమోటర్ కంపెనీలో ఇలాంటి హంగామా చేస్తుంటే ఇతర ఇన్వెస్టర్లు ఏమీ చేయలేని పరిస్థితి. నియంత్రణ సంస్థలు కూడా కళ్ళు మూసుకుని ఉన్నాయి. అదీ మన దేశంలో లిస్టెడ్‌ కంపెనీల చరిత్ర.