సుంకాల సునామీకి మార్కెట్లు బలి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రారంభించిన సుంకాల సునామీ ఇపుడు ఆ దేశాన్నే చుట్టుకుంది. అమెరికాకే గుదిబండగా మారింది. అమెరికాకు దీటుగా చైనా కూడా సుంకాలు విధించడంతో అమెరికా పరిశ్రమలు కంగుతిన్నాయి. చైనా దెబ్బకు వాల్‌స్ట్రీట్ విలవిల్లాడుతోంది. నిన్న ట్రంప్ సుంకాలకు కుప్పకూలిన వాల్‌స్ట్రీట్‌పై ఇవాళ చైనా చావు దెబ్బ కొట్టింది. దీంతో వరుసగా రెండో రోజూ వాల్‌స్ట్రీట్‌లో బ్లడ్‌బాత్ కొనసాగుతోంది. ఐటీ, టెక్ షేర్లతో పాటు ఎకనామీ షేర్లు కూడా దారుణంగా క్షీణించాయి. అమెరికా వస్తువులపై తాను 34 శాతం సుంకం విధిస్తున్నట్లు ఇవాళ చైనా ప్రకటించింది. దీంతో అమెరికా కంపెనీలు కంగుతిన్నాయి.
ఇవాళ ప్రధాన సూచీలన్నీ 4 శాతం పతనం అయ్యాయి. దీంతో వాల్‌స్ట్రీట్‌లో బేర్ ఫేజ్ మొదలైందని స్టాక్ మార్కెట్ విశ్లేషకులు అంటున్నారు. ఇక అమెరికాలో మాంద్యం ఖాయమని తేలడంతో క్రూడ్ ధరలు భారీగా క్షీణించాయి. ఇవాళ కూడా ఏడు శాతంపైగా తగ్గాయి. పరిశ్రమలు మూతపడతాయని… క్రూడ్‌కు డిమాండ్ తగ్గుతుందని ఆర్థిక వేత్తలు హెచ్చరించడంతో కేవలం రెండు రోజుల్లో చమురు ధరలు 15 శాతం క్షీణించాయి. క్రూడ్‌తో పాటు బులియన్ మార్కెట్‌లో కూడా అమ్మకాలు వెల్లువెత్తుతున్నాయి. వెండి ఇవాళ కూడా ఏడు శాతం క్షీణించింది. రెండు రోజుల్లో వెండి 15 శాతంపైగా పడింది. కాపర్‌తోపాటు ఇతర మెటల్స్ కూడా అమ్మకాలు వెల్లువెత్తుతున్నాయి. ఏ మార్కెట్‌లో చూసినా కొనుగోలుదారులు కన్పించడం లేదు. ట్రంప్ సుంకాల సునామీ అమెరికాను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి.