For Money

Business News

వేదాంతాపై తీవ్ర ఆరోపణలు

అనిల్‌ అగర్వాల్‌కు చెందిన వేదాంత రీసోర్సస్‌ కంపెనీపై హిండెన్‌బర్గ్‌ తరహా ఆరోపణలు వచ్చాయి. అమెరికాకు చెందిన షార్ట్‌ సెల్లర్‌ వైస్రాయ్‌ రీసెర్చ్‌ వేదాంత్‌ గ్రూప్‌ కుళ్ళిపోయిన సంస్థ అని ఆరోపించింది. గ్రూప్‌ ఫ్లాగ్‌షిప్‌ కంపెనీ వేదాంత రీసోర్సస్‌ లిమిటెడ్‌ (VRL) ఓ అక్రమాల పుట్ట అని పేర్కొంది. భారత దేశంలో లిస్టయిన వేదాంత లిమిటెడ్‌కు వీఆర్‌ఎల్‌ మాతృసంస్థ. వేదాంత గ్రూప్‌ ఆర్థికంగా ఏమాత్రం మనుగడ సాధించలేని సంస్థ అని, కంపెనీ నిర్వహణలో అనేక లోపాలు ఉన్నాయని వైస్రాయ్‌ ఆరోపించింది. ఈ కంపెనీకి రుణదాతలుగా ఉన్న సంస్థలకు ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించింది. ఈ సంస్థ నివేదికతో ఎన్‌ఎస్‌ఈలో వేదాంత గ్రూప్‌నకు చెందిన వేదాంత లిమిటెడ్‌, హిందుస్థాన్‌ జింక్‌ షేర్లు భారీగా నష్టపోయాయి. వేదాంత లిమిటెడ్‌ ఒకదశలో 9 శాతం దాకా నష్టపోయి రూ. 420.65ని తాకింది. వేదాంత నుంచి వివరణ వచ్చాక షేర్‌ కోలుకుని 3.29 శాతం నష్టంతో రూ.441.30 వద్ద ముగిసింది. ఇదే గ్రూప్‌నకు చెందిన హిందుస్థాన్‌ జింక్‌ షేర్‌ కూడా ఒకదశలోరూ. 415ను తాకింది. తరవాత కోలుకుని రూ. 425 వద్ద ముగిసింది. ఈ కంపెనీ షేర్‌ గత ఏడాది జులై 8వ తేదీన రూ. 717ను తాకి ఈ షేర్‌ ఇవాళ రూ. 415ని తాకింది. గత నెల జూన్‌ 10న రూ. 534 ఉన్న షేర్‌ కేవలం నెల తిరక్కనే రూ. 415 తాకడం విశేషం.