For Money

Business News

డౌడ్రై షాంపూలతో క్యాన్సర్‌!

అమెరికా మార్కెట్‌లో డ్రై షాంపూలైన డౌతో పాటు నెక్సస్‌ వంటి (సన్నటి తుంపరలా ఉండే) పాపులర్‌ బ్రాండ్లను మార్కెట్‌ నుంచి యూనిలివర్‌ కంపెనీ ఉపసంహరించింది. వీటిల్లో క్యాన్సర్‌ కారకమైన బెంజిన్ ఉన్నట్లు పరిశోధనల్లో తేలడమే దీనికి కారణం. అమెరికా మార్కెట్‌లోని నెక్సస్‌, సుఆవే, తిగి, ట్రెసెమె వంటి బ్రాండ్లను కూడా వెనక్కి తీసుకున్నారు. అమెరికా ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌ (ఎఫ్‌డీఏ) ఈ విషయాన్ని తన నోటీసు బోర్డులో ఉంచింది. 2021 అక్టోబర్‌ ముందు తయారు చేసిన ఉత్పత్తులను యూనిలివర్‌ వెనక్కి తీసుకుంది. సన్నటి తుంపరలా ఉండే ఏరోసెల్‌ షాంపూలు, సన్‌స్క్రీన్స్‌పై ఆందోళనలు వ్యక్తం కావడంతో… గత ఏడాదిన్నరలో అనేక ఉత్పత్తులను వివిధ కంపెనీలు మార్కెట్‌ నుంచి వెనక్కి తీసుకున్నాయి. జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ తయారు చేసే నూట్రోగెనాతో పాటు ఎడ్జ్‌వెల్‌ పర్సనల్‌ కేర్‌ కంపెనీ తయారు చేసే బనానా బోట్‌ను కూడా మార్కెట్‌ నుంచి ఉపసంహరించారు. ప్రొక్టర్‌ అండ్‌ గాంబుల్‌ కంపెనీ తయారు చేసే సీక్రేట్‌, ఓల్డ్‌ స్పైస్‌లను కూడా వెనక్కి తీసుకున్నారు. ఇవన్నీ స్ప్రేఆన్‌ యాంటిరెస్పిరెంట్స్‌. కనెక్టికట్‌, న్యూ హావెన్‌లో ఉన్న వాలిస్యూర్‌ అనే ల్యాబ్‌ జరిపిన పరిశోధనల్లో ఇటువంటి ఉత్పత్తుల్లో బెంజిన్‌ ఉన్నట్లు తేలింది. గతంలో కూడా ఈ ల్యాబ్‌ జరిపిన పరిశోధనల కారణంగా ప్రొక్టర్‌ అండ్‌ గాంబుల్‌ కంపెనీ అనేక ఉత్పత్తులను మార్కెట్‌ నుంచి ఉపసంహరించింది. వీటిలో పాంటెన్‌, హెర్బల్‌ ఎసెన్సస్‌ డ్రై షాంపూలు కూడా ఉన్నాయి. స్ప్రే ఆన్‌ డ్రై షాంపూల వల్ల ప్రమాదముందని చాలా కాలం నుంచి హెచ్చరికలు వస్తున్నాయి. క్యాన్ల నుంచి పర్సనల్‌ కేర్‌ ప్రొడక్ట్స్‌ను స్ప్రే చేసేందుకు వాడే ప్రొపెల్లంట్స్‌ (ప్రొపేన్‌, బుటేన్‌ వంటివి) కారణంగా ఏరోసెల్స్‌ ప్రమాదకారిగా మారినట్లు తెలుస్తోంది. ఇపుడు ఉపసంహరించిన ఉత్పత్తుల్లో ఉండే బెంజిన్‌ శాతం వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం లేదంటూనే.. వీటి వల్ల లుకేమియా, ఇతర బ్లడ్‌ క్యాన్సర్స్‌ వచ్చే అవకాశముందని ఎఫ్‌డీఏ పేర్కొంది.