వర్షాలే మోసం చేశాయి
ఈనెల 20వ తేదీ వరకు చూస్తే దేశ వ్యాప్తంగా రుతుపవనాల వర్షాలు సాధారణంగా కంటే 11 శాతం అధికంగా ఉన్నాయి. కాని లేనిచోట్ల అస్సలు పడలేదు. పడుతున్నట్లు చోట్ల కుమ్మరిస్తున్నాయి. దీంతో ఈ ఏడాది మన దేశంలో కూడా ఆహార కొరత ఏర్పడనుందా అన్న చర్చ మొదలైంది. ఖరీఫ్ సీజన్‌కు జులై నెల కీలకం. జులై 20 కల్లా ఈ సీజన్ నాట్లు పూర్తవుతాయి. ఏవో కొన్ని చోట్ల మాత్రమే ఆగస్టులో నాట్లు వేస్తారు. ఇప్పటి వరకు సాధారణ వర్షపాతమేనని భారత వాతవరణ శాఖ అంటున్నా… రాష్ట్రాలవారీగా చూస్తే.. కొన్ని రాష్ట్రాల్లో తీవ్ర కరువు నెలకొన్నట్లు స్పష్టమౌతోంది. మధ్య, దక్షిణ భారత దేశంలో ఈసారి భారీ వర్షాలు కురిశాయి. కాని ఈశాన్య రాష్ట్రాలు బాగా దెబ్బతిన్నాయి. ఈశాన్య రాష్ట్రాలతో పాటు పక్కనే ఉన్న ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. ఆగస్టు నెలలో వర్షాలు చూసిన తరవాత ఆహార సంక్షోభంపై ఓ అంచనాకు రావొచ్చని వ్యవసాయ శాస్త్రవేత్తలు అంటున్నారు. అయితే ఇప్పటి వరకు ఖరీఫ్ పంట విస్తీర్ణం ఆందోళనకరంగానే ఉంది. ముఖ్యంగా వరి పంట ఆందోళన కల్గిస్తోంది. వరి అధికంగా పండించే రాష్ట్రాల్లో ఈసారి కరువు తరహా పరిస్థితి నెలకొంది. గత ఏడాదితో పోలిస్తే వరి పంట విస్తీర్ణం 17 శాతం తగ్గింది. అలాగే కంది పంట విస్తీర్ణం కూడా 20 శాతం తగ్గింది. మినుముల పంట విస్తీర్ణం మాత్రం పెరిగిందని డేటా చెబుతోంది. భారత వాతావరణ శాఖ అందించిన డేటా ప్రకారం ఉత్తరప్రదేశ్‌లో వర్షపాత లోటు 68 శాతం కాగా, జార్ఖండ్‌లో 51 శాతం, బీహార్‌లో 48 శాతంగా ఉంది. ఇక ఈశాన్య రాష్ట్రాల విషయానికొస్తే మణిపూర్‌లో 40 శాతం, త్రిపురలో 30 శాతం, పశ్చిమ బెంగాల్లో 27 శాతం వర్షపాత లోటు ఉంది. ఇక ఢిల్లీలో 22 శాతం, మిజోరంలో 21 శాతం, నాగాల్యాండ్‌లో 18 శాతం, ఉత్తరాఖండ్‌లో 16 శాతం వర్షపాత లోటు ఉంది. ఈ డేటా ప్రస్తుత సీజన్లో జూలై 20వ తేదీ వరకు తీసింది. వీటిలో వరి అధికంగా పండిండే యూపీ, బీహార్లలో కరువు పరిస్థితులు నెలకొన్నాయి. వచ్చే నెలపై ఆశతో ఈ రాష్ట్రాలు ఉన్నాయి. సో… వరి పండించే రైతులకు ఈసారి మంచి ధర రావొచ్చు.