For Money

Business News

ప్రముఖ జర్నలిస్ట్‌ అకౌంట్లపై మస్క్‌ వేటు

భావ ప్రకటనలో పూర్తి స్వేచ్ఛ అంటూ బాకా ఊదిన టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌… తన నిజ స్వరూపం ఇపుడు చూపుతున్నాడు. తనకు వ్యతిరేకంగా వార్తలు రాస్తున్న జర్నలిస్టులతో పాటు తన ప్రత్యర్థి కంపెనీలను పొగిడే జర్నలిస్టులను అకౌంట్లను కూడా సస్పెండ్‌ చేస్తున్నారు. తమ కంపెనీల వార్తలను కవర్‌ చేసే జర్నలిస్టులపై ఈ వేటు పడటం విశేషం. పైగా ఒక్కరికి కూడా ఎందుకు సస్పెండ్‌ చేస్తున్నారో కారణం చెప్పకుండా ఆపేస్తున్నారు. ట్విటర్‌ సస్పెండ్‌ చేసిన అకౌంట్లలో సీఎన్‌ఎన్‌, ద న్యూయార్క్‌ టైమ్స్‌, ద వాషింగ్టన్‌ టైమ్స్, ఇంటర్‌సెప్ట్‌లకు చెందిన జర్నలిస్టులు ఉన్నారు. వీరందరూ టెక్నాలజీ రంగాన్ని కవర్‌ చేసేవారు. తన కంపెనీల బీట్‌ చూసే జర్నలిస్ట్‌లను కారణం చెప్పకుండా సస్పెండ్‌ చేయడంపై ట్విటర్‌లో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు. అందరికీ పూర్తి భావప్రకటనా స్వేచ్ఛ అంటూ ఎలాన్‌ మస్క్‌ చెప్పింది… కేవలం ప్రచారం ఆర్భాటమేనని దీనితో తేలిపోయిందని వీరు విమర్శిస్తున్నారు. ముఖ్యంగా వీరు ట్విటర్‌కు పోటీగా వస్తున్న మాస్టోడన్‌ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ గురించి తరచూ రాయడం ఎలాన్‌ మస్క్‌కు నచ్చడం లేదేమో. చాలా మంది టెక్‌ జర్నలిస్టులు మాస్టోడన్‌ గురించి ప్రశంసిస్తూ పోస్ట్‌లు పెడుతున్నారు. ట్విటర్‌లాంటి ఈ మైక్రో బ్లాగింగ్‌ వెబ్‌సైట్‌ 93 భాషల్లో అందుబాటులో ఉంది. ప్రతి యూజర్‌కు ఇందులో ప్రత్యేక సర్వర్‌ ఉంటుంది.