టప్పర్‌వేర్… కథ కంచికే
78 ఏళ్ళ ఫుడ్ స్టోరేజ్ కంటైనర్ల తయారీ సంస్థ టప్పర్‌వేర్ బ్రాండ్స్ కార్పొరేషన్ దివాలా పిటీషన్ దాఖలు చేసింది. ప్రధాన కంపెనీతో పాటు దాని అనుబంధ కంపెనీలు దివాలా పిటిషన్ దాఖలు చేశాయి. కోవిడ్ సమయంలో తరవాత ఈ కంపెనీకి తీవ్రనష్టాలు వచ్చాయి. ఒకప్పుడు ఫుడ్ స్టోరేజీ కంటైనర్లలో కొత్త విప్లవానికి నాంది పలికిన ఈ కంపెనీ… తరవాత కస్టమర్ల అభిరుచులను పసిగట్టలేకపోయింది. అలాగే భిన్నమైన డిజైన్లు, ధర విషయంలో సంప్రదాయ పద్ధతిలోనే నడవడంతో కంపెనీ పీకలోతు నష్టాల్లో కూరుకుపోయింది. కంపెనీ పని అయిపోందని గత ఏడాది నుంచి వార్తలు వస్తున్నాయి. ఎవరో ఒకరు ఆదుకుంటారనే ఆశతో ఇన్నాళ్ళూ నెట్టుకొచ్చిన కంపెనీ… ఇక సాధ్యంకాని పరిస్థితుల్లో దివాలా పిటీషన్ దాఖలు చేసింది. మరో ఇన్వెస్టరు నిధులు సమకూర్చుతేకాని కంపెనీ మళ్ళీ పుంజుకునే ఛాన్స్ లేదు. ప్రస్తుతానికి కంపెనీ కార్యకలాపాలు యధాతధంగా కొన సాగుతాయని అంటున్నా… ఇంకెంతో కాలం కంపెనీ మనగల లేదని కార్పొరేట్ వర్గాలు అంటున్నారు. 2021,2022 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి కంపెనీ చూపిన ఖాతాల్లో కూడా లొసుగులు ఉన్నాయని బయటపడటంతో… కొత్త ఇన్వెస్టర్లు రావడం కష్టమని కథనాలు వస్తున్నాయి. ఒకవైపు అమ్మకాలు భారీగా పడిపోతున్న సమయంలో యువ వినియోగదారులను ఆకర్షించడం ద్వారా వ్యాపారంలో నిలదొక్కుకోవాలని టప్పర్‌వేర్ ప్రయత్నిస్తున్నా… ఫలితం లేకపోయింది. మార్కెట్‌లో షేర్ భారీగా క్షీణిస్తూ వచ్చింది. కంపెనీ దివాలా పిటిషన్ వేయడానికి ప్రయత్నిస్తోందనే వార్తల నేపథ్యంలో టప్పర్‌వేర్ షేర్ల విలువ 50 శాతం పైగా పడిపోయింది. గత మే నెలల 2.5 డాలర్లు దాకా ఉన్న కంపెనీ షేర్ విలువ ఇపుడు 0.5099కి పడిపోయింది. కంపెనీ షేర్లలో ట్రేడింగ్ కూడా ఆగిపోయింది. ఈ కంపెనీని 1946లో ఎర్ల్ టప్పర్ స్థాపించారు. ఎన్నో సంచలనాలకు కేంద్ర బిందువైన ఈ కంపెనీ ప్లాస్టిక్ ఫుడ్ బాక్సులకు మారు పేరుతో మారింది. అయితే మారుతున్న కాలానుగుణంగా మారలేకపోయింది. తన చుట్టూ వస్తున్న పోటీని గుర్తించలేకపోయింది. ఈ కంపెనీ పునః ప్రారంభంపై చాలా అనుమానాలు ఉన్నాయి.