అమ్మకానికి తిరుపతి ఎయిర్‌పోర్ట్

తిరుపతి ఎయిర్‌పోర్టుతో పాటు దేశంలోని 13 విమానాశ్రయాలను ప్రైవేట్ కంపెనీలకు విక్రయించాలని కేంద్రం నిర్ణయించింది. అయిదేళ్ళలో సుమారు రూ.10 లక్షల కోట్లను ప్రభుత్వ ఆస్తులను అమ్మి సేకరించాలని కేంద్రం నిర్ణయించినట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌లో ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ ప్రక్రియలో భాగంగా 2026 మార్చికల్లా 13 ఎయిర్‌పోర్టులను ప్రైవేట్‌పరం చేయాలని నిర్ణయించారు. తొలిసారి చిన్న ఎయిర్‌పోర్టులను పెద్ద ఎయిర్‌పోర్టులతో కలిపి అమ్మే ప్రక్రియ మొదలు పెడుతున్నారు. అందులో భాగంగా భువనేశ్వర్ ఎయిర్‌పోర్టును తిరుపతి ఎయిర్‌పోర్ట్‌తో కలిపి అమ్ముతారు. అలాగే ఔరంగాబాద్‌ను రాయ్‌పూర్‌తో, గయాతో కుషినగర్, అమృత్‌సర్‌ను కంగారా ఎయిర్‌పోర్టును కలిపి అమ్ముతారు. వాస్తవానికి 2022 నుంచి 2025 మధ్యకాలంలో 25 విమానాశ్రాయాలను విక్రయించాలని ఎన్డీఏ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కేబినెట్ నోట్ కూడా సిద్ధమైంది. ఇందులో 13 విమానాశ్రయాలను అమ్మేందుకు ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చింది. ఈలోగా రాయపూర్, ఇండోర్ ఎయిర్‌పోర్టులను విక్రయించడానికి మధ్యప్రదేశ్ ప్రభుత్వం (బీజేపీ) వ్యతిరేకరించడంతో … ఎయిర్‌పోర్టుల సంఖ్య 11కి తగ్గింది. తాజాగా మరో రెండు ఎయిర్‌పోర్టులు కలిపి 13 ఎయిర్‌పోర్ట్‌లను విక్రయించాలని నిర్ణయించారు.