పీవీఆర్ షేర్‌కు టైగర్ కిక్
పీవీఆర్ ఐనాక్స్ షేర్లు బుధవారం భారీగా లాభపడనున్నాయి. గత కొన్ని రోజులుగా ఈ కౌంటర్లో ఆకర్షణీయ లాభాలు వస్తున్నాయి. బాలీవుడ్లో ఈ ఏడాది వరుసగా హిట్స్ రావడం ఈ కంపెనీకి బాగా కలిసి వస్తోంది. జవాన్ తరవాత ఆదివారం విడుదలైన సల్మాన్ ఖాన్ మూవీ టైగర్ 3 కూడా విజయవంతం కావడంతో డిసెంబర్‌తో ముగిసే త్రైమాసికంలో ఈ కంపెనీ ఆకర్షణీయ ఫలితాలు ప్రకటించే అవకాశముంది. విడుదల కేవలం రెండు రోజుల్లో దేశీయ మార్కెట్లో టైగర్ 3 మూవీ రూ. 100 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. తొలి రోజు కలెక్షన్స్ రూ.44 కోట్లు కాగా, రెండో రోజు కలెక్షన్స్ రూ. 57.52 కోట్లు దాటాయి. దీంతో ఈ సినిమా కూడా జవాన్ స్థాయి కలెక్షన్స్ సాధిస్తుందని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో కూడా ఈ సినిమా కేవలం రెండు రోజుల్లో రూ. 94 కోట్లను సాధించింది. మున్ముందు షారుక్ ఖాన్ నటించిన ఢంకీతో పాటు ప్రభాస్ మూవీ సాలార్ ఉండటంతో పీవీఆర్ ఐనాక్స్ మంచి బిజినెస్ సాధించే అవకాశముంది.