… రూ. 3,360 కోట్లకు
తాను సీఎంగానే అసెంబ్లీలో అడుగుపెడతానని టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన శపథం… హెరిటేజ్ ఫుడ్స్ కంపెనీ ఇన్వెస్టర్లకు కాసుల పంట పండించింది. ఎలాగైనా గెలిచి తీరాలనే పట్టుదలతో ఆయన జరిపిన నిరంతర కృషి ఆ ఇన్వెస్టర్లకు లక్షాధికారులను చేసింది. ఆయన నేతృత్వంలో కూటమి భారీ మెజారిటీతో గెలవడంతో హెరిటేజ్ కంపెనీ షేర్లు తారాజువ్వలా దూసుకుపోయాయి. కేవలం 12 ట్రేడింగ్ సెషన్స్‌లో కంపెనీ షేర్ల ధరలు రెట్టింపు అయింది. దీంతో చంద్రబాబు కుటుంబ సంపద ఏకంగా రూ. 1,225 కోట్ల మేర పెరిగింది. గత ఏడాది ఆరంభంలో హెరిటేజ్ కంపెనీ ఒక షేరుకు ప్రతిగా ఒక షేర్‌ను ముఖవిలువకే ఇన్వెస్టర్లకు రైట్స్ కింద జారీ చేసింది. 2023 జనవరి 8న ఈ షేర్ ధర రూ. 186. తరవాత ఈ షేర్ ధర రూ. 137కు పడిపోయింది. అక్కడి నుంచి కోలుకున్న ఈ షేర్ ఎన్నికల పోలింగ్ తరవాత జెట్ స్పీడ్‌ను అందుకుంది. ఈ ఏడాది ఏప్రిల్ 12న రూ. 308ని తాకినీ షేర్ పోలింగ్ తేదీ తరవాత ఊపందుకుంది. అక్కడి నుంచి మొదలైన ర్యాలీలో ఈనెల 10న రూ. 727ను తాకింది.
కృషికి తగ్గ ఫలితం
హెరిటేజ్ కంపెనీలో చంద్రబాబు ఫ్యామిలీకి సొంతంగా, వివిధ అనుబంధ కంపెనీల ద్వారా 50 శాతానికి పైగా వాటా ఉంది. ప్రమోటర్ల కోటాలోనే చంద్రబాబు ఫ్యామిలీకి 41 శాతం వాటా ఉంది. అయితే చంద్రబాబు పేరున మాత్రం ఎలాంటి షేర్లు లేవు. మెజారిటీ వాటా నారా భువనేశ్వరి పేరున ఉంది. ఆమె పేరుతో 2.26 కోట్ల షేర్లు ఉన్నాయి. ఇవాళ్టి క్లోజింగ్ ధర లెక్కన చూసినా … ఆమెకు హెరిటేజ్ షేర్ల ద్వారా సమకూరిన సంపద రూ. 1,572 కోట్లు. ఇక నారా లోకేష్‌కు ఈ కంపెనీలో కోటి షేర్లు ఉన్నాయి. అంటే ఆయనకు హెరిటేజ్ ద్వారా సమకూరిన సంపద రూ. 696 కోట్లు అన్నమాట. లోకేష్ కుమారుడు దేవాంశ్‌కు ఈ కంపెనీలో ఉన్న షేర్ల విలువ రూ. 29.92 కోట్లకు చేరింది. ఇదే కంపెనీలో నారా ఫ్యామిలీకి మెగాబిడ్ ఫైనాన్స్ పేరున 51 లక్షల షేర్లు ఉన్నాయి. దీంతో ఈ ఫ్యామిలీకి కంపెనీలో 41 శాతానికి చేరింది. ఇవి కాకుండా ఇదే ఫ్యామిలీకి చెందిన నిర్వాణ హోల్డింగ్ కంపెనీకి కోటి షేర్లు ఉన్నాయి. అంటే 12 శాతం వాటా అన్నమాట. ప్రమోటర్లకు, నిర్వాణకు ఉన్న వాటా 53 శాతం. దీని విలువ ఇవాళ్టి క్లోజింగ్ ధర ప్రకారం చూస్తే… సుమారు రూ. 3360 కోట్లకు పైనే. 12 రోజుల క్రితం ఈ షేర్ల విలువ రూ. 1,680 కోట్లు మాత్రమే. పోలింగ్ ప్రారంభానికి ముందు ఈ షేర్ల విలువ రూ.1500 కోట్ల లోపే.
ఇన్వెస్టర్లకు కనకవర్షం
హెరిటేజ్ ఫుడ్స్ ఇన్వెస్టర్లకు చరిత్ర పునరావృతమైంది. 2014 ఎన్నికల్లో టీడీపీ విజయం తరవాత హెరిటేజ్ ఫుడ్స్ షేర్ సూపర్ ఫలితాలను అందించింది. 2013లో కంపెనీ ఇచ్చిన బోనస్‌తో ఇన్వెస్టర్లు అనూహ్యంగా లాభపడ్డారు. అయితే 2019 తరవాత హెరిటేజ్ తీవ్ర ఒడుదుడుకులను ఎదుర్కొంది. ఎన్నికల తరవాత ఫ్యూచర్ గ్రూప్‌తో ఒప్పందం వల్ల షేర్ ధర భారీగా తగ్గింది. 2023 జనవరిలో ముఖవిలువకే రైట్స్ ఇచ్చినా షేర్ కోలుకోలేకపోయింది. ఎక్స్ రైట్స్ 186 దాకా ఉన్న షేర్ ధర మే నెలలో రూ. 137కు పడిపోయింది. దీనికి ప్రధాన కారణం… జగన్ ప్రభుత్వం నారా ఫ్యామిలీపై చేసిన ఆర్థిక యుద్ధం. దీని ప్రభావం హెరిటేజ్‌పై పడింది. ముఖ్యంగా అమరావతి పరిసర ప్రాంతాల్లో హెరిటేజ్ ఫుడ్స్ ఇన్‌సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడిందంటూ చేసిన ఆరోపణల ఫలితంగా కంపెనీ షేర్ బాగా తగ్గింది. 2023 మే నెలలో షేర్ ధర రూ.137కు పడిపోయింది. అక్కడి నుంచి కోలుకున్న షేర్ ధర సెప్టెంబర్ నెలా ఆరంభంలో రూ. 300కు చేరువ అవుతున్న సమయంలో చంద్రబాబు అరెస్ట్ షేర్‌ను దెబ్బతీసింది. హెరిటేజ్ షేర్ ధర రూ. 222కు పడిపోయింది. డిసెంబర్ రెండోవారం వరకు కూడా షేర్ ధర అదే స్థాయిలో కొనసాగింది. హెరిటేజ్‌తోనే కొనసాగిన ఇన్వెస్టర్లకు 2024 సంవత్సరం గోల్డన్ ఛాన్స్ ఇచ్చింది. ఎన్నికల పోలింగ్ తేదీకి ముందు అంటే ఏప్రిల్ 6వ తేదీన హెరిటేజ్ షేర్ ధర రూ.303ని తాకింది. అక్కడి నుంచి మొదలైన ర్యాలీ ఈనెల 10న ఆల్‌టైమ్ గరిష్ఠ స్థాయి ధర రూ. 727ను తాకే దాకా కొనసాగింది. అంటే ఏడాది క్రితం హెరిటేజ్ షేర్లు కొన్న ఇన్వెస్టర్లకు కాసుల పంట పండింది. రైట్స్‌లో షేర్లు కొన్నవారికి వద్దంటే డబ్బే అనే స్థాయిలో షేర్ పెరిగింది.