For Money

Business News

నిరాశపర్చిన టీసీఎస్‌ నికర లాభం

డిసెంబర్‌తో ముగిసిన మూడు నెలల కాలంలో ఐటీ దిగ్గజం టీసీఎస్‌ పనితీరు నిరాశపర్చింది. కంపెనీ టర్నోవర్‌ పెరిగినా… నికర లాభంలో విషయంలో నిరాశపర్చింది. మార్కెట్‌ అంచనాల మేరకు కంపెనీ నికర లాభం ఆర్జించలేకపోయింది. డిసెంబర్‌తో ముగిసిన మూడు నెలల్లో రూ.10,846 కోట్లు నికర లాభం ఆర్జించింది. గతేడాది ఇదే సమయంలో రూ.9,769 కోట్లతో పోలిస్తే 11 శాతం పెరిగినా.. మార్కెట్‌ అంచనాలను మాత్రం అందుకోలేకపోయింది. ఈ త్రైమాసికంలో కంపెనీ రూ. 11,200 కోట్ల నికర లాభం ఆర్జిస్తుందని మార్కెట్‌ నిపుణలు అంచనా వేశారు. అయితే కంపెనీ ఆదాయం మాత్రం 19.1 శాతం పెరిగి రూ.58,229 కోట్లకు చేరింది. గతేడాది ఇదే సమయంలో కంపెనీ ఆదాయం రూ.48,885 కోట్లు. కంపెనీ నుంచి ఉద్యోగుల వలసలు 21.5 శాతం నుంచి 21.3 శాతానికి తగ్గింది. ప్రస్తుత త్రైమాసికంలో కంపెనీకి 750 కోట్ల డాలర్ల ఆర్డర్లు వచ్చినట్లు కంపెనీ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ రాజేశ్‌ గోపీనాథ్‌ తెలిపారు. ఒక్కో షేరుపై రూ. 67 స్పెషల్‌ డివిడెండ్‌, రూ. 8 తాత్కాలిక డివిడెండ్‌ను కంపెనీ ప్రకటించింది. దీనికి రికార్డు డేట్‌ను జనవరి 17. ఫిబ్రవరి 3న డివిడెండ్‌ చెల్లింపులు చేయనున్నట్లు కంపెనీ తెలిపింది. కంపెనీ టర్నోవర్‌ లో ఉత్తర అమెరికా, బ్రిటన్‌ మార్కెట్ల నుంచి వచ్చిన వ్యాపారం మూడింటి రెండొంతులు కాగా, నికర లాభాలో నాలుగింట మూడొంతులు ఈ దేశాల నుంచే వచ్చింది. ఫలితాల నేపథ్యంలో టీసీఎస్‌ షేరు సోమవారం బీఎస్‌ఈలో 3.35 శాతం లాభపడి రూ.3,319.79 చేరింది.