టీసీఎస్ పనితీరు ఇది…

దేశంలోని అతి పెద్ద ఐటీ సేవల సంస్థ టీసీఎస్ మరోసారి నిరాశపర్చింది. టర్నోవర్ విషయంలో పరవాలేదనిపించినా… నికర లాభం గత త్రైమాసిక స్థాయిలో కూడా రాలేదు. రెండో త్రైమాసిక ఫలితాలను కంపెనీ ఇవాళ ప్రకటించింది. జులై- సెప్టెంబర్ త్రైమాసికానికి రూ.12,075 కోట్ల నికర లాభాన్ని కంపెనీ ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 1.39 శాతం వృద్ధి కన్పిస్తున్నా… జూన్ త్రైమాసిక స్థాయిలో లేదు. అలాగే మార్కెట్ అంచనాలకు చేరువగా కూడా లేదు. గతేడాది రెండో త్రైమాసికంలో కంపెనీ రూ.12,527 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. ఈసారి నికర లాభం తగ్గడానికి మరో కారణం రూ. 1,135 కోట్ల వన్ టైమ్ ఖర్చు చూపడమే.
కంపెనీ టర్నోవర్ మాత్రం గత త్రైమాసికంతో పోలిస్తే 3.7 శాతం పెరిగి రూ. 65,799 కోట్లకు చేరింది. 65,114 కోట్లు ఉంటుందని మార్కెట్ అంచనా వేసింది. గతేడాది ఇదే త్రైమాసికంలో టర్నోవర్ 64,259 కోట్లు. ఒక్కో షేరుకు రూ.11 చొప్పున మధ్యంతర డివిడెండ్‌ను కంపెనీ ప్రకటించింది. స్థిర కరెన్సీ రేటు ప్రకారం చూస్తే అంతర్జాతీయ ఆదాయం దాదాపు పెరగలేదనే చెప్పాలి. BFSI కూడా కేవలం నామమాత్రంగానే పెరిగింది. ఆపరేటింగ్ మార్జిన్ మాత్రం 0.7 శాతం పెరిగి 25.2 శాతానికి చేరింది. నికర మార్జిన్ కూడా 19.6 శాతమని టీసీఎస్ వెల్లడించింది.