టాటా మోటార్స్‌కు ఏమైంది?
ఇవాళ టాటా మోటార్స్ షేర్ ఇన్వెస్టర్లకు షాక్ ఇచ్చింది. ముఖ్యంగా సంప్రదాయ ఇన్వెస్టర్ల డార్లింగ్ అయిన టాటా మోటార్స్ ఇవాళ ఏకంగా ఆరు శాతం దాకా క్షీణించింది. గత కొన్ని రోజుల నుంచి టాటా మోటార్స్ నుంచి నెగిటివ్ న్యూస్‌లు వస్తున్నాయి. ముఖ్యంగా కంపెనీ అమ్మకాలు ఆశాజనకంగా లేవని వార్తలు వస్తున్నాయి. మొత్తం పరిశ్రమ పరిస్థితి ఇలానే ఉందని… అయితే టాటా మోటార్స్‌పై ఇన్వెస్టర్లకు భారీ ఆశలు ఉండటంతో… ఇవాళ్టి నెగిటివ్ న్యూస్ ప్రభావం షేర్‌పై తీవ్రంగా పడిందని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. పండుగ సీజన్‌లో ఈ కంపెనీ వాహనాలపై రూ.3 లక్షల దాకా డిస్కౌంట్ ఇస్తోందన్న వార్తలు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశాయి. అమ్మకాలను పెంచుకునేందుకు కంపెనీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. కంపెనీ ప్యాసింజర్ వాహనాల విభాగంతో పాటు జాగ్వర్, ల్యాండ్ రోవర్‌ల నుంచి మార్జిన్లు తగ్గే ప్రమాదముందని బ్రోకరేజీ సంస్థ యూబీఎస్ ఇవాళ రిపోర్ట్ విడుదల చేసింది. ముఖ్యంగా ఎలక్ట్రిక్ విభాగం మార్జిన్లు తగ్గే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ప్రస్తుత కంపెనీ పనితీరును బట్టి చూస్తే… ప్రస్తుత షేర్ వ్యాల్యూయేషన్ అధికంగా ఉందని యూబీఎస్ పేర్కొంది. దీంతో ఈ షేర్‌ను అమ్మాల్సిందిగా ఇన్వెస్టర్లను సిఫారసు చేసింది. షేర్ టార్గెట్ ధర రూ.825గా పేర్కొంది. నిన్న టాటా మోటార్స్ షేర్ రూ.1035 వద్ద ముగిసింది. ఇవాళ రూ.1000 వద్ద ప్రారంభమైన వెంటనే ఈ షేర్ రూ. 1011 గరిష్ఠ స్థాయిని తాకింది. అక్కడి నుంచి పతనం ప్రారంభమై… చివరిదాకా కొనసాగింది. నిఫ్టి కూడా భారీగా నష్టపోవడంతో ఈ షేర్ కనిష్ఠ స్థాయి వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈలో ఈ షేర్ రూ. 976.40 వద్ద ముగిసింది. అంటే 5.78 శాతం చొప్పున క్షీణించిందన్నమాట.