For Money

Business News

రూ. 5,000 కోట్ల పబ్లిక్‌ ఆఫర్‌

స్టాక్‌ మార్కెట్‌లో కొత్త ఇష్యూల హోరు సాగుతోంది. ఇన్వెస్టర్ల నుంచి భారీ మద్దతు లభించడంతో కంపెనీలు కూడా భారీ మొత్తాలను మార్కెట్‌ నుంచి సమీకరించాలని భావిస్తున్నారు. ఫుడ్‌ డెలివరీ కంపెనీ స్విగ్గీ మార్కెట్‌ నుంచి రూ. 3500 కోట్లు సమీకరించాలని తొలుత నిర్ణయించినా… ఇపుడు దీన్ని రూ. 5000 కోట్లకు పెంచింది. జొమాటొ షేరుకు ఇటీవల సెకండరీ మార్కెట్‌లో మంచి ఆదరణ లభిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత ట్రెండ్‌ను క్యాష్‌ చేసుకునేందుకు స్విగ్గీ ప్రయత్నిస్తోంది. పబ్లిక్‌ ఆఫర్‌కు సంబంధించిన ప్రతిపాదనకు వచ్చేనెల 3న జరిగే కంపెనీ ఈజీఎంలో వాటాదారుల ఆమోదం పొందనుంది. ఈ మేరకు ప్రత్యేక ప్రతిపాదన సిద్ధం చేసింది. ఆఫర్‌ ఫర్‌ సేల్‌ ద్వారా రూ. 6,664 కోట్లను సమీకరించాలని స్విగ్గీ భావిస్తోంది. రూ. 10,400 కోట్లు సమీకరించేందుకు స్విగ్గీ గత ఏప్రిల్‌లో ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. పబ్లిక్‌ ఇష్యూ సమయంలో తమ కంపెనీ విలువ రూ. 1.26 లక్షల కోట్లుగా స్విగ్గీ చూపనుంది. 2024 మార్చితో ముగిసిన ఏడాదిలో కంపెనీ రూ. 11,247 కోట్ల టర్నోవర్‌ను సాధించింది. ఇదే సమయంలో కంపెనీ నష్టాలు రూ. 4,179 కోట్ల నుంచి రూ. 2,350 కోట్లకు తగ్గాయి.