నిఫ్టి క్షీణించినా…

మార్కెట్ ఇవాళ ఓపెనింగ్ నుంచి చివరి దాకా లాభాల స్వీకరణలో ఉంది. ఉదయం 25661 పాయింట్ల వద్ద ప్రారంభమై 25669 పాయింట్ల గరిష్ఠ స్థాయి తాకినా.. అంత కొంతసేపే. ఆరంభంలోనే నష్టాల్లోకి జారుకున్న నిఫ్టి మిడ్ సెషన్‌లో కాస్త కోలుకునే ప్రయత్నం చేసినా… నిలబడలేదు. దీంతో నిఫ్టి మిడ్ సెషన్ తరవాత 25473 పాయింట్ల కనష్ఠ స్థాయిని తాకింది. గరిష్ఠ స్థాయితో పోలిస్తే 200 పాయింట్లు నష్టపోయింది. అయితే క్లోజింగ్‌కు ముందు స్వల్ప రికవరీ రావడంతో 25517 వద్ద 120 పాయింట్ల నష్టంతో ముగిసింది. నిఫ్టికన్నా ఇవాళ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ నిఫ్టిలో గట్టి మద్దతు లభించింది. చాలా వరకు షేర్లు భారీ లాభాలతో ముగిశాయి. ఇవాళ లోయర్ సర్క్యూట్‌లో 67 షేర్లు ట్రేడవగా, 144 షేర్లు అప్పర్ సర్క్యూట్‌తో ముగిశాయి. 52 వారాల గరిష్ఠ స్థాయికి చేరిన షేర్లు కూడా ఎక్కువ. ఇక నిఫ్టి షేర్లలో ట్రెంట్ టాప్ గెయినర్‌గా నిలిచింది. తరవాతి స్థానాల్లో బీఈఎల్, ఎస్‌బీఐ, ఇండస్ ఇండ్ బ్యాంక్, జియో ఫైనాన్స్ ఉన్నాయి. తమ అనుబంధ సంస్థలను స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ చేయాల్సిందిగా పీఎస్‌యూ బ్యాంకులను కేంద్రం ఆదేశించిందన్న వార్తలతో పీఎస్‌యూ బ్యాంకులు చాలా ఆకర్షణీయ లాభాలతో ముగిశాయి.