స్టార్ హెల్త్ ఐపీఓ- దరఖాస్తు చేయొచ్చా?
స్టార్ షేర్ బ్రోకర్ రాకేష్ ఝున్‌ఝున్ వాలాకు 16 శాతం పైగా వాటా ఉన్న ఈ కంపెనీ ఐపీఓ అంటే… మార్కెట్‌లో ఆసక్తి రావడం సహజమే. మార్కెట్ నుంచి రూ. 7,249 కోట్లు సమీకరించడానికి ఉద్దేశించిన ఈ ఆఫర్ ఇవాళ ప్రారంభం కానుంది. డిసెంబర్ 2న ఆఫర్ ముగుస్తుంది. ఆఫర్ చేసే మొత్తంలో రూ. 2,000 కోట్లను కొత్త షేర్ల జారీ ద్వారా చేస్తున్నారు కాబట్టి…ఆ మొత్తం మాత్రమే కంపెనీకి వెళుతుంది. మిగిలిన రూ. 5,249 కోట్లు ఇపుడు ఉన్న ఇన్వెస్టర్లు తమ వాటాను అమ్ముకుంటున్నారు కాబట్టి వారికి వెళతాయి. అయితే రాకేష్ ఝున్‌ఝున్‌వాలా మాత్రం తన వాటాను అమ్మడం లేదు.
రూ. 10 ముఖవిలువ కలిగిన ఈ షేర్‌ను రూ. 870- రూ. 900లకు ఆఫర్ చేస్తున్నారు. ఇష్యూకు దరఖాస్తు చేయాలంటే కనీసం మొత్తం రూ. 14,400 (16 షేర్లు) ఉండాలి. గరిష్ఠంగా 208 షేర్లకు అంటే 13 లాట్లకు దరఖాస్తు చేయాలంటే రూ. 1,87,000 కావాలి. ఇష్యూ డిసెంబర్ 10న లిస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.
ఇక ఈ ఇష్యూకు దరఖాస్తు చేయాలా వద్దా అన్న అంశంపై స్టాక్ మార్కెట్ విశ్లేషకులు చాలా వరకు ఏకాభిప్రాయంతో ఉన్నారు. దీర్ఘకాలానికి మాత్రమైతేనే దరఖాస్తు చేయమని సలహా ఇస్తున్నారు. అంటే స్వల్ప కాలంలో ఇందులో లాభాలు ఉండవు. అంటే ఇష్యూ ధరకన్నా తక్కువకు ఈ షేర్ లభించే అవకాశముంది. మార్కెట్‌లో ఏమాత్రం కరెక్షన్ వచ్చినా… తక్కువ ధరకు ఈ షేర్లు దొరుకుతాయి. అనధికార మార్కెట్‌లో ఈ షేర్‌కు దాదాపు ఎలాంటి ప్రీమియం లేదు. దాదాపు పేటీఎం పబ్లిక్ ఆఫర్ పరిస్థితే కన్పిస్తోంది. ఈ విశ్లేషణలను చూస్తే…ఈ ఆఫర్‌కు దరఖాస్తు చేయడం అనవసరం. డౌన్ ట్రెండ్‌లో తక్కువ ధరకు లభించినపుడు కొనుగోలు చేయొచ్చు.