రూ. 70,000 లోపు వెండి

డాలర్ మళ్ళీ పుంజుకోవడంతో అంతర్జాతీయ మార్కెట్లలో బులియన్ ధరలు తగ్గుతున్నాయి. ముఖ్యంగా అమెరికా డేటా చాలా పాజిటివ్‌గా రావడం, నిరుద్యోగ భృతికి దాఖలు చేసే దరఖాస్తుల సంఖ్య తగ్గడంతో… అమెరికాలో మాంద్యం రాకపోవచ్చనే వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో డాలర్ ఇండెక్స్ 103ని దాటడం విశేషం. డాలర్ బలం.. బులియన్ మార్కెట్‌పై స్పష్టంగా కన్పిస్తోంది. అమెరికా మార్కెట్‌లో వెండి 2 శాతం దాకా క్షీణించి 22.45 డాలర్లకు క్షీణించింది. అలాగే ఔన్స్ బంగారం కూడా 0.47 శాతం తగ్గి 1913 డాలర్లకు పడింది. దీని ప్రభావం మన మార్కెట్లలో కన్పిస్తోంది. ఎంసీఎక్స్ ఫ్యూచర్స్ మార్కెట్‌లో ఇవాళ కిలో వెండి ధర (ఆగస్టు కాంట్రాక్ట్) రూ. 1019లు తగ్గి రూ. 69,194కు చేరింది. వెండి రూ. 70,000 కీలక స్థాయిని కోల్పోవడంతో టెక్నికల్‌గా మరింత బలహీనంగా మారింది. ఇక బంగారం ఆగస్టు కాంట్రాక్ట్ ధర కూడా ఫ్యూచర్స్ మార్కెట్‌లో రూ. 58000 దిగువకు చేరి రూ. 57,800 వద్ద ట్రేడవుతోంది.