For Money

Business News

రావిర్యాల ఈ-సిటీలో టీసీఎల్‌ యూనిట్‌

ప్రముఖ అంతర్జాతీయ బ్రాండ్‌ టీసీఎల్‌ కంపెనీ హైదరాబాద్‌కు రానుంది. ఏకంగా రూ. 225 కోట్లతో తయారీ యూనిట్‌ను నెలకొల్పనుంది. తెలంగాణకు చెందిన రిసోజెట్‌ అనే సంస్థతో కలిసి జాయింట్ వెంచర్‌ రూపంలో కొత్త యూనిట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు టీసీఎల్‌ సంస్థ తెలిపింది. కొత్త ప్లాంట్‌ ఏర్పాటుకు సంబంధించి మంత్రి కేటీఆర్ సమక్షంలో టీసీఎల్‌ సంస్థ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మధ్య ఒప్పందం కుదుర్చుకుంది. తొలి దశలో 500లకు పైగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని టీసీఎల్‌ వెల్లడించింది. రంగారెడ్డి జిల్లా రావిర్యాలలో ఉన్న ఈ-సిటీలో ఈ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయనుంది. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ… ఎలక్ట్రానిక్స్‌ తయారీకి తెలంగాణ రాష్ట్రం అధిక ప్రాధాన్యమిస్తుందని అన్నారు. రాష్ట్రం నుంచి హైటెక్నాలజీ ఉత్పత్తుల తయారీకి అవకాశం ఉందని తెలిపారు. చైనాలోని హెఫెయి నగరంలోని టీసీఎల్‌ ప్రధాన కేంద్రం ఉంది… విదేశాల్లో ఈ సంస్థ ఏర్పాటు చేస్తున్న తొలి తయారీ యూనిట్ ఇదే కావడం విశేషం. హైదరాబాద్‌ యూనిట్‌లో తొలుత వాషింగ్ మెషీన్లు తయారు చేస్తామని.. తరవాత రిఫ్రిజిరేటర్లు, డిష్‌ వాషర్లు ఉత్పత్తి చేస్తామని టీసీఎల్‌ తెలిపింది.