చివర్లో షార్ట్ కవరింగ్
ఇవాళ మార్కెట్లు చాలా పటిష్ఠంగా ముగిశాయి. సెప్టెంబర్ సిరీస్ అద్భుతమైన ముగింపు ఇచ్చింది. ఉదయం నుంచి లాభాల్లోనే ఉన్నా… అసలు ర్యాల రెండు గంటలకు ప్రారంభమై చివరి దాకా సాగింది. ఉదయం 26005 వద్ద ప్రారంభమైన నిఫ్టి … తరవాత 25998ని తాకినా తరవాత చాలా సేపు 26050-26075 మధ్య కదలాడింది. చివరల్లో 26,250ని తాకినా… 26215 వద్ద 211 పాయింట్ల లాభంతో నిఫ్టి ముగిసింది. నిఫ్టిలో ఏకంగా 41 షేర్లు లాభాల్లో ముగిశాయి. బ్యాంక్, ఎన్‌బీఎఫ్‌సీల షేర్లతో పాటు నిఫ్టి నెక్ట్స్‌కు ప్రాతినిధ్యం వహించే షేర్లలో మంచి ర్యాలీ కన్పించింది. క్రమంగా మార్కెట్ మిడ్ క్యాప్స్ నుంచి లార్జ్ క్యాప్ షిఫ్ట్ అవుతున్నట్లు తెలుస్తోంది. ఇవాళ కూడా మిడ్ క్యాప్ సూచీ ఫ్లాట్‌గా ముగిసింది. మరోవైపు హ్యుండాయ్ పబ్లిక్ ఆఫర్ వచ్చే నెలలోనే రానుండటంతో ఒక్కసారిగా ఆటో రంగ షేర్ల రీరేటింగ్ మొదలైంది. టూవీలర్స్ డల్‌గా ఉండగా, ఫోర్ వీలర్ కంపెనీల షేర్లు పరుగులు తీస్తున్నాయి. ముఖ్యంగా మార్కెట్ లీడర్ అయిన మారుతీ సుజుకీ షేర్‌పై ఆసక్తి పెరిగింది. ఇవాళ ఆ షేర్ నాలుగున్నర శాతం పెరిగింది. అలాగే టాటా మోటార్స్ కూడా మూడు శాతం దాకా పెరిగింది.