నష్టాల్లో సింగపూర్ నిఫ్టి
రాత్రి అమెరికా మార్కెట్లు కోలుకున్నా.. నష్టాల్లోనే ముగిశాయి. నిన్న ఓపెనింగ్‌లో అన్ని సూచీలు ఒక శాతం పైగా నష్టంతో ట్రేడయ్యాయి. తరవాత నష్టాలు తగ్గినా… ఒక మోస్తరు నష్టాలతో ముగిశాయి. డౌజోన్స్ బాగా కోలుకుంది. ఈ సూచీ అర శాతం నష్టంతో క్లోజ్ కాగా ఎస్ అండ్ పీ 500 సూచీ 0.75 శాతం నష్టంతో క్లోజైంది. మరోవైపు నాస్డాక్ కూడా కోలుకుని 0.72 శాతం నష్టంతో ముగిసింది. అంతకుముందు యూరప్ మార్కెట్లు కూడా దాదాపు ఇదే స్థాయి నష్టాలతో ముగిశాయి. ఉదయం నుంచి ఆసియా మార్కెట్లన్నీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. న్యూజిల్యాండ్, హాంగ్‌కాంగ్ మార్కెట్లు ఒకశాతంపైగా నష్టంతో ట్రేడవుతుండగా, మిగిలిన మార్కెట్లలో అమ్మకాల ఒత్తిడి నామమాత్రంగానే ఉంది. చైనా మార్కెట్ల నష్టాలు స్వల్పంగా ఉన్నాయి. జపాన్ నిక్కీ 0.2 శాతం నష్టంతో ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలో సింగపూర్ నిఫ్టి 64 పాయింట్ల నష్టంతో ట్రేడవుతోంది. రాత్రి చమురు ధరలు భారీగా క్షీణించాయి. మొన్న 122 డాలర్ల ఉన్న చమురు ధర ఇవాళ 114 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. దీంతో నిఫ్టి నష్టాల్లో లేదా స్థిరంగా ప్రారంభమయ్యే అవకాశముంది.