ఈ ఏడాది గడ్డ కట్టే చలి…వర్షాలు
ఇన్నాళ్ళూ ఎల్ నినో వల్ల కష్టాలు పడ్డ జనం… ఇపుడు ఎల్ నినా ఎఫెక్ట్ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని భారత వాతావరణ విభాగం హెచ్చరించింది. ఎల్ నినో వల్ల వర్షాలు తగ్గడం, అధిక ఉష్ణోగ్రత కారణంగా ఈ ఏడాది ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా అనేక పంటలు కూడా దెబ్బతిని దిగుబది తగ్గింది. ప్రభుత్వం కొన్ని ఆహార ధాన్యాల ఎగుమతిపై నిషేధం లేదా ఆంక్షలు విధించింది. ఈనెల 2వ తేదీన దేశంలో ఎల్ నినా ప్రవేశించినట్లు వాతావరణ విభాగం వెల్లడించింది. దీనివల్ల అధిక వర్షాలతో పాటు వాతావరణంలో తీవ్ర మార్పులు ఉంటాయని హెచ్చరించింది. చలికాలంలో చలితీవ్రత చాలా అధికంగా ఉంటుందని పేర్కొంది. ఉత్తరాది రాష్ట్రాల్లో ఈ ప్రమాదం మరీ ఎక్కువగా ఉండే అవకాశముంది. జమ్మూకాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఈ శీతాకాలంలో చలి తీవ్రత చాలా ఉంటుందని, సాధారణ స్థాయికంటే ఉష్ణోగ్రత మూడు డిగ్రీలకు పడిపోయే అవకాశం ఉంటుందని వాతావరణ విభాగం అధికారులు తెలిపారు. ఈసారి తీవ్ర చలితో పాటు వర్షాలు కూడా కురుస్తాయని… దీని ప్రభావం రబీ పంటలపై తీవ్రంగా ఉంటుందని పేర్కొన్నారు. మారే వాతావరణానికి అనుగుణంగా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు. ముఖ్యంగా ఉత్తరాది ప్రజలు ఖచ్చితంగా హీటర్లు ఉంచుకోవాలని తెలిపారు. అలాగే తగిన ఆహార పదార్థాలు నిల్వ ఉంచుకోవాలని కోరారు. సాధారణంగా రుతుపవనాలు.. సెప్టెంబర్‌తో ముగుస్తాయని… కాని ఈసారి మరికొంతకాలం కొనసాగే అవకాశముందని అధికారులు హెచ్చరించారు. ఈసారి శీతాకాలంలో దేశ ప్రజలందరికీ ఇబ్బందులు ఏర్పడే అవకాశముందని ఐఎండీ హెచ్చరించింది. ముఖ్యంగా గ్రామీణ, అటవీ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. ముఖ్యంగా చలి తీవ్రంగా ఉన్న సమయంలోనే భారీ వర్షాలకు కూడా ఆస్కారం ఉందని, దీంతో జనం చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించింది.