ప్రపంచ షేర్ మార్కెట్లలో అమ్మకాల హోరు
ప్రధాన దేశాల్లో వడ్డీ రేట్లు పెరగడం ఖాయంగా కన్పిస్తోంది.దీంతో ప్రభుత్వ బాండ్లపై ఈల్డ్స్ పెరుగుతున్నాయి. దీంతో ప్రపంచ షేర్ మార్కెట్లలో అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. నిన్న యూరో మారెట్ల నుంచి మొదలు ఇవాళ ఆసియా మార్కెట్ల వరకు భారీ అమ్మకాలు జరుగుతున్నాయి. రాత్రి అమెరికా మార్కెట్లలో ముఖ్యంగా టెక్నాలజీ షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. మైక్రోసాఫ్ట్, ఫేస్‌బుక్, గూగుల్… ఇలా కీలక కంపెనీ షేర్లు మూడు శాతంపైగా పడ్డాయి. నాస్‌డాక్ ఏకంగా 3 శాతం దాకా క్షీణించింది. డౌజోన్స్, ఎస్ అండ్ పీ 500 సూచీలు కూడా రెండు శాతం దాకా క్షీణించాయి. నిన్న ఒక మోస్తరు నష్టాలతో ముగిసిన ఆసియా మార్కెట్లు ఇవాళ భారీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. జపాన్ నిక్కీ ఏకంగా 3 శాతం దాకా నష్టంతో ట్రేడవుతోంది. హాంగ్‌సెంగ్ ఒక శాతం నష్టపోగా, ఇతర మార్కెట్లు ఒకటిన్నర శాతం నష్టంతో ట్రేడవుతున్నాయి. ఇక సింగపూర్ నిఫ్టి 100 పాయింట్లకు పైగా నష్టంతో ఉంది. ఈలెక్కన నిఫ్టి ఇవాళ దాదాపు ఇదే స్థాయి నష్టాలతో ప్రారంభం కానుంది.