మళ్ళీ అదానీ గ్రూప్ షేర్ల పతనం
చాలా రోజుల తరవాత అదానీ గ్రూప్‌లోని అన్ని షేర్లు ఇవాళ నష్టాల్లో ముగిశాయి. ఆరంభంలో కాస్త స్థిరంగా ఉన్న అదానీ షేర్లు… మిడ్ సెషన్ వరకు నిలకడగా ఉన్నాయి. నష్టాల్లోకి జారుకున్నా… నామమాత్రంగా తగ్గాయి. మిడ్ సెషన్ తరవాత ఈ కౌంటర్లలో భారీ అమ్మకాల ఒత్తిడి వచ్చింది. ఇవాళ డెరివేటివ్స్ సెగ్మెంట్ వారాంతపు క్లోజింగ్. దీనివల్ల ఈ కౌంటర్లలో అమ్మకాల ఒత్తిడి వచ్చిందా… లేదా ఇతర కారణాలు ఉన్నాయా అన్నది వెల్లడి కాలేదు. ఇవాళ అత్యధికంగా అదానీ ఫ్లాగ్షిప్ కంపెనీ అదానీ ఎంటర్‌ప్రైజస్ భారీగా నష్టపోయింది. చివర్లో స్వల్పంగా కోలుకున్నా… ఆరు శాతం దాకా నష్టపోయింది. ఇక అదానీ పోర్ట్స్ కూడా తొలుత నాలుగు శాతం దాకా నష్టపోయినా… చివర్లో కోలుకుని మూడు శాతం నష్టంతో ముగిశాయి. ఇవాళ అత్యంత భారీ నష్టంతో ముగిసింది మాత్రం అదానీ పవర్. ఈ షేర్ సుమారు ఏడు శాతం దాకా నష్టపోయి 324 రూపాయల వద్ద ముగిసింది. అదానీ ట్రాన్స్ మిషన్, అదానీ గ్రీన్ షేర్లు నాలుగు నుంచి ఆరు శాతం దాకా తగ్గాయి. అదానీ టోటల్, అదానీ విల్మర్ నష్టాలు స్వల్పమే అని చెప్పొచ్చు. ఇక ఇదే గ్రూప్‌నకు చెందిన అంబుజా సిమెంట్, ఏసీసీ షేర్ల కూడా నష్టపోయాయి. దీంతో అదానీ గ్రూప్ షేర్లపై మళ్లీ వందంతులు మొదలయ్యాయి. హిండెన్‌బర్గ్ నివేదికపై సెబి నివేదిక రెడీ అవుతున్న తరుణంలో భారీ పొజిషన్స్ తీసుకోవడానికి ఇన్వెస్టర్లు కూడా జంకుతున్నారు. ఏ కాస్త రూమర్ వచ్చినా… అమ్ముకోవడానికి రెడీ అవుతున్నారు. సెబీ నివేదిక సుప్రీం కోర్టుకు చేరే వరకు ఈ షేర్లలో హెచ్చుతగ్గులు తప్పేలా లేవు.