లారస్ ల్యాబ్లో అమ్మకాల ఒత్తిడి
హైదరాబాద్కు చెందిన లారస్ ల్యాబ్ షేర్లో ఇవాళ అమ్మకాల ఒత్తిడి వచ్చే అవకాశముంది. ఈ కంపెనీ ఆర్థిక ఫలితాలపై ఆశలతో నిన్న ఈ షేర్లో భారీ కొనుగోళ్ల మద్దతు వచ్చింది. ఈ షేర్ నిన్న ఎన్ఎస్ఈలో 6.42 శాతం లాభంతో రూ. 515.20 వద్ద ముగిసింది. అయితే కంపెనీ ఫలితాలు నిరాశాజనకంగా ఉన్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికి లారస్ ల్యాబ్స్ ఏకీకృత లాభం కేవలం 4 శాతం మాత్రమే పెరిగి రూ.251 కోట్లుగా నమోదైంది. గత ఏడాది ఇదే కాలంలో లాభం రూ.241 కోట్లుగా ఉంది. కంపెనీ ఆదాయం మాత్రం 20 శాతం పెరిగి రూ.1,279 కోట్ల నుంచి రూ.1,539 కోట్లకు చేరింది. ఈ కాలంలో కంపెనీ రూ.209 కోట్ల పెట్టుబడులు పెట్టింది. నాన్-ఏఆర్వీ ఏపీఐలు, ఫార్ములేషన్లు, సీడీఎంఓ కార్యకలాపాలపై దృష్టి కేంద్రీకరించామని లారస్ ల్యాబ్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ చావా సత్యనారాయణ తెలిపారు. అయితే కంపెనీ ఫలితాలతో మార్కెట్ నిరాశ చెందింది. దీంతో షేర్ రూ.521 వద్ద ప్రారంభమైనా.. అమ్మకాల ఒత్తిడి రావడంతో స్వల్ప నష్టంతో రూ. 506 వద్ద ట్రేడవుతోంది.