గాలి కేసులో ఇక రోజూవారీ విచారణ!
ఓబుళాపురం మైనింగ్ స్కాం కేసులో ఇక రోజూవారీ విచారణకు ఆదేశిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను శుక్రవారం జారీ చేస్తామని పేర్కొంది. బెయిల్ షరతులను సడలించాలని జనార్దన్‌రెడ్డి దాఖలు చేసుకున్న పిటిషన్‌పై గురువారం జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ కృష్ణమురారితో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. ‘రోజూవారీ ట్రయల్ జరపాలని ట్రయల్ కోర్టును ఆదేశిస్తాం. అక్కడి విచారణ పురోగతి తెలుసుకోడానికి కేసు విచారణను జనవరికి వాయిదా వేస్తాం. సుప్రీంకోర్టు అనుమతితోనే గాలి జనార్దన్‌రెడ్డి బళ్లారి వెళ్లాలన్న నిబంధన పునరుద్ధరిస్తాం. తద్వారా సాక్షులను బెదిరించడం, సాక్ష్యాధారాలను చెరిపివేయడం వంటి అనుమానాలకు తావుండదు. జనవరి వరకు ట్రయల్ సాగనివ్వండి. సాక్షులను విచారించనివ్వండి. అప్పుడు బెయిల్ షరతు సడలింపుపై నిర్ణయం తీసుకుంటాం’ అని ప్రతిపాదించింది. దీనిపై గాలి జనార్దన్‌రెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది మీనాక్షి అరోరా స్పందిస్తూ.. ఆయన కుమార్తె రెండ్రోజుల క్రితమే బళ్లారిలో బిడ్డకు జన్మనిచ్చిందని, వాళ్లను చూడడానికి ఆయన వెళ్లాల్సి ఉందని తెలిపారు. అక్కడ ఎన్ని రోజులు ఉంటారని ధర్మాసనం ప్రశ్నించింది. కనీసం రెండు నెలలు ఉండాలనుకుంటున్నారని అరోరా సమాధానమిచ్చారు. అంత సమయమివ్వడం అసాధ్యమని ధర్మాసనం చెప్పడంతో నెల సమయం ఇవ్వాలని అరోరా కోరారు. ధర్మాసనం విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది.