నిమ్మగడ్డను వొదలని జగన్ స్కామ్
వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఇష్టారాజ్యం చెలరేగిన పారిశ్రామిక వేత్తలందరూ ఇపుడు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా గల్ఫ్ దేశాల నుంచి భారీ పెట్టుబడులు తెచ్చిన వీరు… తరవాత సొమ్ము చెల్లించకుండా ముప్పు తిప్పలు పెడుతున్నారు. మొన్న పెన్నా గ్రూప్… ఇపుడు మ్యాట్రిక్స్ ప్రసాద్ వంతు. వైఎస్ హయాంలో ప్రారంభించిన వాన్‌పిక్ ప్రాజెక్టు కోసం రస్ అల్ ఖైమా ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ నుంచి భారీ మొత్తం నిధులు తెచ్చిన పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ తరవాత ఆ నిధులు చెల్లించడంలో విఫలమయ్యారు. కేసు అంర్జాతీయ ఆర్బిట్రేషన్ కోర్టుల వరకు వెళ్ళింది. 2008లో ఆంధ్రప్రదేశ్ వాన్‌పిక్ ప్రాజెక్టు కోసం 12 కోట్ల డాలర్లను పెట్టుబడి పెట్టామని రాకియా తెలిపింది. అప్పటి తమ కంపెనీ ఈసీఓ ఖతర్ మసాద్‌తో కలిసి మ్యాట్రిక్స్ ప్రసాద్ తన సొమ్మును దుర్వినియోగం చేశారని ఆరోపించింది. కేసును పరిశీలించిన యూఏఈ కోర్టు నిమ్మగడ్డ ప్రసాద్‌కు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చింది. రాకియా ఇచ్చిన రూ. 500 కోట్లను వడ్డీతో కలిపి చెల్లించాలని ఆదేశించింది. వడ్డీతో కలిపి రూ. 643 కోట్లు చెల్లించాలని తీర్పులో స్పష్టం చేసింది.
యూఏఈ కోర్టు తీర్పుపై మ్యాట్రిక్స్ ప్రసాద్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. గత ఫిబ్రవరి 12వ తేదీన సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు మేరకు రూ. 600 కోట్లను కోర్టులో సెక్యూరిటీగా సమర్పించారు. ఇందులో రూ. 212 కోట్ల విలువైన ఆస్తులు, షేర్లు కూడా ఇచ్చారు. అయితే ఇప్పటికే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ జప్తు ఆస్తులను కూడా ప్రసాద్ సమర్పించడంతో కోర్టు తిరస్కరించింది. అలాగే రూ. 125 కోట్ల నగదును యూకో బ్యాంక్‌లో డిపాజిట్ చేయాలని ఆదేశించింది. దీన్ని ఫిక్సెడ్ డిపాజిట్‌గా పరిగణించానలి, ప్రతి ఆరునెలలకు ఒక సారి రెన్యూవల్ చేసేలా చూడాలని బ్యాంక్‌ను ఆదేశించింది. అలాగే తెలంగాణలోని మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా దేవరయాంజల్‌లో ఉన్న 37 ఎకరాల భూమికి సంబంధించిన ఒరిజినల్ పత్రాలను కూడా కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది. మొత్తం రూ. 600 కోట్లను డిపాజిట్ చేయాలని పేర్కొంది. మిగిలిన ఆస్తులు సమకూర్చడానికి దీనికి కొంత సమయం కూడా ఇచ్చింది.
అయితే వీరిద్దరి మధ్య నెలకొన్న వివాదాన్ని మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకునేందుకు కూడా ఇరు పార్టీలకు అవకాశం ఇచ్చింది. ఇరుపక్షాల అంగీకారంతో సుప్రీ కోర్టు రిటైర్డ్ చీఫ్ జస్టిస్ యూయూ లలిత్‌ను మధ్యవర్తిగా నియమించింది. మధ్యవర్తిత్వ ప్రక్రియ ముగిసే వరకు నిమ్మగడ్డ తన స్థిరాస్తులను ఎవరికీ బదలాయించకూడదని లేదా అమ్మరాదని కోర్టు స్పష్టం చేసింది.
క్విడ్ ప్రో కో కోణం…వాన్‌పిక్ ప్రాజెక్టు కోసం రాకియా నుంచి సేకరించిన పెట్టుబడులను నిమ్మగడ్డ ప్రసాద్ జగన్ మోహన్ రెడ్డికి చెందిన కంపెనీల్లో పెట్టుబడులుగా మళ్లించారనే ఆరోపణలు వచ్చాయి. దీనిపై సీబీఐ, ఈడీ కూడా చార్జిషీటు దాఖలు చేసింది. సుమారు 12 కోట్ల డాలర్లను తన పెట్టుబడిని ప్రాజెక్టు అవసరాలకు కాకుండా ఇతర ప్రయోజనాలకు వాడారని రాకియా ఆరోపించింది. సీబీఐ దాఖలు చేసిన చార్జిషీటుపై ఇపుడు విచారణకు రావాల్సి ఉంది.
లేదంటే జప్తు ఖాయం
తమకు రావాల్సిన బకాయిలు చెల్లిస్తే వివాదాన్ని ముగించేందుకు రాకియా సిద్ధంగా ఉంది. ఒకవేళ మధ్యవర్తిత్వం విఫలమైతే, నిమ్మగడ్డ డిపాజిట్ చేసిన నగదు , భూములను రాకియాకు చెల్లింపుల కోసం కోర్టు వినియోగించే అవకాశం ఉందని న్యాయ నిపుణులు అంటున్నారు.
