ద్రవ్యోల్బణం ఎఫెక్ట్: ఈఎంఐ పెరగనుంది
గత పరపతి విధానంలో ద్రవ్యోల్బణం పెద్ద అంశం కాదనే విధంగా మాట్లాడుతూ… వడ్డీ రేట్లను ఆర్బీఐ యధాతథంగా ఉంచింది. కాని పరోక్షంగా బ్యాంకులకు స్వేచ్ఛ ఇచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా వడ్డీ రేట్లు పెరుగుతున్న నేపథ్యంలో మనదేశంలో కూడా వడ్డీ రేట్ల పెరిగేందుకు రంగం సిద్ధమైంది. ఇవాళ విడుదలైన WPI కూడా ఏడు నెలల గరిష్ఠ స్థాయికి చేరడంతో బ్యాంకులు తమ వడ్డీ రేట్లను పెంచడం ప్రారంభించాయి. ఈ దిశగా దేశంలో నంబర్ వన్ బ్యాంక్ ఎస్బీఐ తొలి అడుగు వేసింది. మార్జినల్ కాస్ట్ ఆఫ్ లెండింగ్ రేట్లను (MCLR)ను 0.1 శాతం పెంచినట్లు ఎస్బీఐ ఇవాళ ప్రకటించింది. సవరించిన రేట్లు ఈనెల 15 నుంచి అమల్లోకి వచ్చినట్లు తన వెబ్సైట్లో బ్యాంక్ పేర్కొంది. బ్యాంక్ నిర్ణయంతో గృహ, వాహన, ఇతర రుణాల వడ్డీ రేట్లు పెరగనున్నాయి. ఒక రోజు, ఒక నెల, మూడు నెలల MCLR రేట్లను 0.1 శాతం పెరగడంతో… ఇపుడు 6.65 శాతంగా ఉన్న MCLR ఇక నుంచి 6.75 శాతానికి చేరింది. ఆరు నెలల కాలపరిమితిపై ఈ రేటు 7.05, ఏడాదికి 7.10 శాతం, రెండేళ్ల కాలపరిమితిపై 7.30, మూడేళ్ల కాలపరిమితిపై 7.40 శాతానికి రేట్లను ఎస్బీఐ సవరించింది. MCLRను బ్యాంకులు కనీస వడ్డీ రేటుగా పరిగణిస్తారు. అంటే దీనికన్నా తక్కువ వడ్డీకి రుణం ఇవ్వడానికి నిబంధనలు అనుమతించవు. దీంతో ఎంసీఎల్ఆర్ ఆధారంగా బ్యాంకులు వడ్డీ నిర్ణయిస్తాయి. ఇపుడు ఈ రేటు పెరగడంతో రుణాల ఈఎంఐ భారం పెరగనుంది.