ఆ దేశాలకు క్రూడ్ అమ్మకాలు బంద్
రష్యా నుంచి దిగుమతి చేసుకునే ముడి చమురుకు 60 డాలర్ల కంటే ఎక్కువ ధర చెల్లించరాని అమెరికా, యూరోపియన్ దేశాలతో పాటు మరికొన్ని దేశాలు నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ నెల 5వ తేదీ నుంచి ఈ కండీషన్లు అమల్లోకి వచ్చాయి. ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఇలా తమ దేశంపై ఆంక్షలు విధించిన దేశాలకు, కొనుగోలుదారులకు క్రూడ్ అమ్మరాదని రష్యా నిర్ణయించింది. దీనికి సంబందించిన ఉత్తర్వులపై రష్యా అధ్యక్షుడు పుతిన్ సంతకం చేశారు. ఇప్పటికే ఫార్వర్డ్ ఒప్పందాలు ఉంటాయి కాబట్టి… ఫిబ్రవరి 1వ తేదీ నుంచి జులై 1వ తేదీ వరకు సదరు దేశాలకు క్రూడ్ అమ్మరాదని రష్యా నిర్ణయించింది. అలాగే క్రూడ్ ఉత్పత్తులపై కూడా ఇలాంటి ఆంక్షలు విధించింది. ఏయే ఉత్పత్తులపై నిషేధం విధిస్తారో త్వరలోనే ఆ జాబితాను రష్యా వెల్లడించనుంది. అయితే ప్రత్యేక కేసుల్లో రష్యా అధ్యక్షుడు పుతిన్ కొన్ని దేశాలకు లేదా సంస్థలకు మినహాయింపు ఇవ్వొచ్చని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.