For Money

Business News

టెస్లాకు లైన్‌ క్లియర్‌!

రాయితీలు ఇస్తేనే భారత్‌లో ప్లాంట్‌ పెడుతానని ఎప్పటి నుంచో టెస్లా కంపెనీ అంటోంది. ఇన్నాళ్ళూ ససేమిరా అన్న భారత ప్రభుత్వం ఎట్టకేలకు.. ఆ కంపెనీ డిమాండ్‌లకు అనుగుణంగా ఎనర్జి విధానాన్ని మార్చింది. ఈవీ కంపెనీలను ఆకర్షించేందుకు రూపొందించిన కొత్త పాలసీని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ పాలసీతో ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీ రంగంలో భారత్‌ విశ్వ శక్తిగా అవతరించనుందని కేంద్రం భావిస్తోంది.
దేశంలో ఈవీ మార్కెట్‌ శరవేగంగా వృద్ధి చెందుతోంది. దీంతో మన మార్కెట్లో ప్రవేశించేందుకు అనేక అంతర్జాతీయ కంపెనీలు ఆసక్తితో ఉన్నాయి. అయితే ఈ కంపెనీలు పలు రాయితీలను కోరుతున్నాయి. మరోవైపు భారత్‌లో పలు ప్రాజెక్టులను విదేశీ కంపెనీలు ప్రకటించాయి. వియత్నాంకు చెందిన ఈవీ కంపెనీ విన్‌ఫాస్ట్‌ రూ.16,000 కోట్ల పెట్టుబడులతో తమిళనాడులో విద్యుత్‌ వాహనాలు, బ్యాటరీల తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. మోడీ ప్రభుత్వం కొత్తగా తెచ్చిన ఈవీ విధానంతో మరిన్ని కంపెనీలు భారత్‌లో పెట్టుబడులను ప్రకటించవచ్చని తెలుస్తోంది.