చక్కెర ఎగుమతులపై ఆంక్షలు
పట్టపగ్గాల్లేకుండా పెరిగిపోతున్న ద్రవ్యోల్బణ కట్టడికి ప్రభుత్వం ఆలస్యంగా మేల్కొంది. ద్రవ్యోల్బణం 17 సంవత్సరాల గరిష్ఠ స్థాయికి చేరే వరకు పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించని ప్రభుత్వం… వంటనూనెలు, చక్కెర ధరలు కూడా భారీగా పెరిగేంత వరకు నిమ్మకుండిపోయింది. ద్రవ్యోల్బణ రేటు పెరుగుతున్నా ఆర్బీఐ చర్యలు తీసుకోకపోవడంతో అంతర్జాతీయ వేదికలపై ఆర్బీఐ అభాసుపాలైంది. వెంటనే మేలుకున్న ఆర్బీఐ వడ్డీ రేట్లను పెంచగా.. ఇపుడు ప్రభుత్వం నిత్యావసర వస్తువుల ధరల కట్టడికి ప్రయత్నిస్తోంది. వంటనూనెల దిగుమతులపై ఆంక్షలు సడలించిన తరవాత ఇపుడు చక్కెర ఎగుమతులపై ఆంక్షలు విధించింది. ఈ ఏడాది అక్టోబరుతో ముగిసే చక్కెర సీజన్లో చక్కెర ఎగుమతులను కోటి టన్నులకు పరిమితం చేసింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జూన్ 1 నుంచి ఇది అమల్లోకి రానుంది. పండగల సీజన్లో దేశంలో చక్కెర ధరలు చుక్కలనంటే ప్రమాదం ఉండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ సంవత్సరం ఇప్పటి వరకు మన దేశం నుంచి 90 లక్షల టన్నుల చక్కెర ఎగుమతులకు ఒప్పందాలు కుదిరాయి. ఇందులో ఇప్పటికే 75 లక్షల టన్నుల చక్కెర ఎగుమతి అయ్యింది. బ్రెజిల్లో పంట దెబ్బతినడంతో అంతర్జాతీయ మార్కెట్లో చక్కెర ధర పెరిగింది. దీంతో దేశీయ చక్కెర మిల్లులకు పెద్ద ఎత్తున ఎగుమతి అవకాశాలు ఏర్పడ్డాయి. అయితే దేశీయంగా చక్కెర ధరలు పెరగకుండా ఉండేందుకు… ఎగుమతులపై ఆంక్షలు విధించింది. చక్కెర ఎగుమతులపై మనదేశం ఆంక్షలు విధించడం ఆరేళ్ల తర్వాత ఇదే తొలిసారి.